ఆసిఫాబాద్: శుభ ముహూర్తాల నేపథ్యంలో బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, బాలరక్ష భవన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ బాలరక్ష భవన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో రహస్య సమాచార సేకరణతోపాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కమూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ పెంచాలన్నారు. బాల్యవివాహాలతో ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, బాలల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడే ప్రభావాల గురించి వివరించాలని సూచించారు. గ్రామస్థాయిలో బాలల సంరక్షణ కమిటీలను బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పెంటుబాయి, లైలా, షూర్ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త బండి సంతోష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


