అమ్మ క్షేత్రంలో విత్తన పూజలు | - | Sakshi
Sakshi News home page

అమ్మ క్షేత్రంలో విత్తన పూజలు

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

● నేటి నుంచి జంగుబాయి సన్నిధిలో ఉత్సవాలు ● తరలిరానున్న గిరిజన రైతులు

కెరమెరి: జిల్లాలోని గిరిజన గ్రామాలు విత్తన పూజ లకు సిద్ధమయ్యాయి. బుధవారం నుంచి తెలంగా ణ– మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్‌గూడ అడవుల్లో కొలువైన తమ ఇష్టదైవం జంగుబాయి పుణ్య క్షేత్రంలో ఆదివాసీలు విత్తన పూజలకు శ్రీకారం చుట్టనున్నారు. గుహలోని దీపం వద్ద ప్రత్యేక పూజ లు చేసి, రావుడ్‌, పోచమ్మ, మైసమ్మ దేవతలకు విత్తనాలను చూపించి మొక్కులు చెల్లించుకోనున్నారు. జిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గిరిజనులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు.

భక్తుల ప్రగాఢ నమ్మకం

ఏటా మృగశిర కార్తె ప్రారంభానికి ముందే జంగుబాయి సన్నిధిలో విత్తనాలను ఉంచి పూజలు చేయడం ఆచారం. అక్కడ పూజించిన విత్తనాలను చేలలో విత్తితే పంటలు సమృద్ధిగా పండుతాయని, అధిక దిగుబడులు వస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీనిని గోండి భాషలో ‘మెహతుక్‌’అని పిలుస్తారు. మంగళవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం నిర్వహించగా, బుధవారం నుంచి నెలరోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. వివిధ గ్రామాల నుంచి మేళాలు(బృందాలు) తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు.

దేవతల ఆశీర్వాదం తీసుకుని..

మే నెలలో ప్రతీ గ్రామంలోని పటేల్‌ ఇంట్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. గ్రామస్తులందరూ కలిసి తమ కుల దైవాలు పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి ఖిల్లా, పద్మల్‌పురి కాకో దర్శనానికి వెళ్లి విత్తనాలను చూపిస్తారు. దేవతల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తిరిగి గ్రామానికి చేరుకుని ఆకీపేన్‌, అమ్మోరు, పోచమ్మ తల్లుల వద్ద విత్తనాలకు పూజలు చేస్తారు. అనంతరం పటేల్‌ పంపిణీ చేసే విత్తనాలను రైతులు ఇళ్లకు తీసుకెళ్తారు. అదేరోజు అర్ధరాత్రి రెండున్నర కిలోల జొన్నలను పిండి చేసి, వాటితో గట్క వండి ఆరగిస్తారు. అనంతరం అడవికి వెళ్లి చెట్టు(కుమ్ముడ్‌) ఆకులను తెచ్చి డొప్పలుగా తయారు చేస్తారు. ఆ డొప్పల్లో పూజించిన విత్తనాలను వేసి గ్రామంలోని అన్ని ఇళ్లకు పంచుతారు. ఈ కార్యక్రమాలన్నీ మృగశిర కార్తెకు కొద్దిరోజుల ముందుగానే పూర్తిచేస్తారు.

రైతు కుటుంబాల్లో సందడి

మృగశిర కార్తెకు ముందు నుంచే రైతుల కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విత్తన పూజల రోజు ఉదయాన్నే ఇళ్లను శుభ్రం చేసుకుని పేడతో అలికి ముగ్గులు వేస్తారు. అనంతరం పొలంబాట పట్టి, అక్కడ కులదేవతలు, నేలతల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆపై పొలంలో విత్తనాలు చల్లి, నాగలికి పూజలు చేసి దున్నడం ప్రారంభిస్తారు. పటేల్‌ ఇళ్ల ఎదుట మహిళలు పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా వంటి పురాతన క్రీడలు ఆడుతూ ఉత్సాహంగా గడుపుతారు. అలాగే మరికొందరు ఆదివాసీలు తమ ఇష్ట దైవమైన చంచి భీమల్‌ దేవుడి పెళ్లి సందర్భంగా ఏప్రిల్‌, మే నెలల్లోనే విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరు డొప్పల్లో విత్తనాలు కలిపి భీమల్‌ దేవుని వద్ద ఉంచి పూజిస్తారు. ఆ విత్తనాలను భద్రపరిచి, మృగశిర కార్తె రాగానే పొలాల్లో చల్లుతారు.

Advertisement
 
Advertisement
Advertisement