ఆర్టీసీలో సమ్మె సైరన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

● యాజమాన్యంతో జేఏసీ చర్చలు విఫలం ● మంగళవారం అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేత

ఆసిఫాబాద్‌: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వంతోపాటు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు అందించారు. గత కొన్ని వారాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపింది. తాజాగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఆర్టీసీ మంత్రితో పాటు యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె అనివార్యమైంది.

జిల్లాపై ప్రభావం

మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఓ వైపు వేసవి సెలవులు ప్రారంభం కావడం, వివాహాది శుభకార్యాలు ఉండడంతో సమ్మె ప్రభావం జిల్లాలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పడనుంది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 76 బస్‌ సర్వీసులు ఉండగా, 269 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతిరోజూ ఐదు రూట్లతో 71 షెడ్యూళ్లు, 30 వేల కిలోమీటర్లు, 16 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు రూ.16 లక్షల ఆదాయం సమకూరుతుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ 32 డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేయాలని, 2021, 2025 వేతన సవరణలు, 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.350 కోట్లు షరతులు లేకుండా విడుదల చేయాలని, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రయోజనాలు కల్పించడంతోపాటు 32 డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో ప్రైవేటు బస్సులను నడిపిస్తాం.

– రాజశేఖర్‌, ఆర్టీసీ డీఎం, ఆసిఫాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement