జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు ప్రారంభం 34 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం కార్యాచరణ వేసవి దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు
దహెగాం: జిల్లాలో యాసంగి వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. మరో వారం రోజుల్లో కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడకుండా జిల్లావ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు అనువైన స్థలాలను అధికారులు పరిశీలించారు.
23 వేల ఎకరాల్లో సాగు..
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 23,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలోని దహెగాం, కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్, కాగజ్‌నగర్, సిర్పూర్ (టి) మండలాల్లో సాగు అధికంగా ఉంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, తిర్యాణి, రెబ్బెన మండలాల్లోనూ బోర్లు, వట్టివాగు, పీపీరావు ప్రాజెక్టు ఆయకట్టు కింద పండిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి మెరుగ్గా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మరో వారం రోజుల్లో వరికోతలు ఊపందుకోనున్నాయి. అయితే, రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో అకాల వర్షాలతో పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.
34 కొనుగోలు కేంద్రాలు..
యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 34 ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 19 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 15 కేంద్రాలను నిర్వహించనున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌లో 40 కేంద్రాలు ఉండగా, యాసంగిలో వాటి సంఖ్యను 34కు తగ్గించారు. ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ (బీ గ్రేడ్) రకానికి రూ.2,369 మద్దతు ధర ప్రకటించింది. వీటితోపాటు సన్నరకం వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా చెల్లించే అవకాశం ఉంది. ఈ బోనస్ అందుతుందనే ఆశతోనే చాలా మంది రైతులు ఈసారి సన్నరకాలను పెద్దఎత్తున సాగు చేశారు.
కేంద్రాల్లో సౌకర్యాల కల్పన
గతంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కేంద్రాల వద్ద తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచుతామని అధి కారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, షెడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నా రు. ధాన్యం సేకరణ, తరలింపులో ఆలస్యం కాకుండా సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, తాలు లేకుండా నాణ్యతా ప్రమాణాల మేరకు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది కొనుగోళ్లలో జరిగిన ఆలస్యం పునరావృతం కాకుండా త్వరితగతిన ప్రక్రియను పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
దహెగాంలోని కేంద్రంలో
ఆరబెట్టిన వరిధాన్యం(ఫైల్)
త్వరలో కొనుగోళ్లు ప్రారంభం
యాసంగి వరి కొనుగోలుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 34 కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. ఎండలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నాం. వర్షం వచ్చినా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధం చేశాం. కోతలు ముమ్మరం కాగానే సేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు సన్నరకానికి క్వింటాలుకు రూ.500 బోనస్ రైతులకు అందుతుంది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి.
– మోహన్, డీసీవో


