కాగజ్‌నగర్‌టౌన్: డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం మూడు దశల్లో సీట్లు భర్తీ చేయనుండగా, మొదటి విడత దరఖాస్తులు ఈ నెల 15 నుంచి స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించగా, మే 14న సీట్లు కేటాయించనున్నారు. రెండో దశ మే 15 నుంచి 30 వరకు, మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ మే 31 నుంచి జూన్ 20 వరకు కొనసాగనుంది. ఫస్ట్ ఫేజ్‌కు రూ.200, సెకండ్, థర్ట్ ఫేజ్‌కు రూ.400 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీటు కన్ఫామ్ అయిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో ఇలా..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది. జిల్లాలో 3,745 మంది సెకండియర్ పరీక్షలకు హాజరుకాగా, 3,077 మంది ఉత్తీర్ణులయ్యారు. డిగ్రీలో అడ్మిషన్ పొందాలంటే వీరు దోస్త్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఇంటర్ మార్కుల మెమో, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు, కులం, ఆదాయం, నివాస, ధ్రువీకరణ పత్రాలు, పూర్తి చిరునామా, కలర్‌ఫొటో, సెల్ నంబర్(ఆధార్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి), క్రీడలు, ఎన్‌ఎస్‌ఎస్ సర్టిఫికెట్లు ఉంటే జతచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఉంది. అలాగే ప్రైవేట్ యాజమాన్యాల కింద ఎనిమిది డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్ డిగ్రీ కళాశాలలో సుమారు 600, ఆసిఫాబాద్ 340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలో సుమారు 300 సీట్లు భర్తీ చేసేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీజీసీహెచ్‌ఈ) అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ కోసం దోస్త్ ద్వారా అడ్మిషన్లు ప్రారంభించారు. బీఏ, బీకాం(కంప్యూటర్స్), బీఎస్సీ(బీజెడ్‌సీ), బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ కంప్యూటర్ గ్రూప్‌లు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు విధానం
డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజు పేమెంట్ చేయడం వంటి విషయాల్లో విద్యార్థులకు అవగాహన ఉంటే సెల్‌ఫోన్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేకుంటే మీసేవ, జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని సహాయ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దోస్త్ అప్లికేషన్‌లో ఓటీపీ అత్యంత కీలకం. ఫోన్ నంబర్‌కు ఆధార్ అనుసంధానమైతేనే దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. సెల్‌ఫోన్‌కు వచ్చిన పిన్, అంతకు ముందు దోస్త్ ఐడీ ఆధారంగా సంబంధిత పోర్టల్‌లో లాగిన్ కావ్వాలి. ఆయా కళాశాలల్లో ఆసక్తి గల కోర్సు, కళాశాలను ఎంపిక చేసుకోవాలి. సీట్ల కేటాయింపు తర్వాత ఆన్‌లైన్‌లోనే రిపోర్టు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నిర్ణీత తేదీల్లో కళాశాలల్లో సంబంధిత జిరాక్స్ ప్రతులు సమర్పించాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలంటే ఆన్‌లైన్ ద్వారా దోస్త్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చే సుకునేందుకు టీజీసీహెచ్‌ఈ అవకాశం కల్పించింది. దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్ ఆధార్‌కు లింక్ అయ్యి ఉండాలి. వి ద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాస్థాయిలో హెల్ప్‌లైన్ సెంటర్ కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చే శాం. అప్లికేషన్‌లో ఇబ్బందులు ఎదురైతే కోఆర్డినేటర్ నంబర్ 9440194179కు ఫోన్ చేసి సందేహా లు నివృత్తి చేసుకోవాలి. https://dost.cgg.g ov.in వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026– 27 విద్యా సంవత్సరం నుంచి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి చేయనుంది. – శ్రీదేవి,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కాగజ్‌నగర్


