ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జై నూర్ మండలం ధబోలి గ్రామానికి చెందిన మెస్రం మారుబాయి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్నెట్ సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని పెంచికల్‌పేట్ మండలానికి పోర్మేటి సరోజ కోరింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితా 3 నుంచి తన పేరును జాబితా 1లోకి మార్చాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన పుస్తం పూజిత విన్నవించింది. లావుణి పట్టా భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు బోర్‌వెల్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని లింగాపూర్ మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ వినతి అందించాడు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ జారీ చేయాలని దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన మానెపల్లి అమృత, బెజ్జూర్ మండలం సలుగుపల్లికి చెందిన దుర్గం కౌసల్య కోరారు. చింతలమానెపల్లి మండలం రణవెల్లిలోని ప్రాథమకోన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించాలి
‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో గుడిసెలు తీసేసి నిర్మాణ పనులు ప్రారంభించాం. బేస్‌మెంట్ పూర్తయి గోడల నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇళ్లు లేక బయట ఉంటున్నాం. వర్షాకాలం వస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బిల్లులు మంజూరు చేసి, ఇళ్లు పూర్తయ్యేలా చూడాలి.’ అని వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామానికి చెందిన సిడాం భీమ్‌బాయి, మడావి గిరిజాబాయి, ఆత్రం లచ్చు, మెడపతి భీము కోరారు.


