మార్చి 8న వ్యాక్సినేషన్ ప్రారంభం జిల్లాలో ఇప్పటివరకు వేసుకున్నది 419 మందే.. అవగాహన కల్పిస్తున్నా ఆసక్తి చూపని బాలికలు
వాంకిడి: గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. జిల్లావ్యాప్తంగా వసతి గృహాలు, హైస్కూల్స్, అంగన్‌వాడీల రికార్డుల ప్రకారం జిల్లాలో 3,980 మంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించి.. జిల్లాలోని 24 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందుబాటులో ఉంచారు. అయితే వైద్యారోగ్యశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా బాలికలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి అనాసక్తి చూపుతున్నారు. నెల దాటినా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 10.5 శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు.
3,980 మంది కిశోర బాలికలు
భవిష్యత్తులో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను చేపడుతోంది. వైద్యారోగ్య శాఖ అధికారులు జిల్లాలో 14– 15 ఏళ్ల బాలికలు 3,980 మంది ఉన్నట్లు గుర్తించి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు ఏఎన్‌ఎంలు, ఆశలు, అంగన్‌వాడీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అయినా టీకాలు తీసుకునేందుకు బాలికలు ముందుకు రావడం లేదు. మార్చి 8న ప్రారంభమైన ఈ కార్యక్రమం నెల గడిచి 12 రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు 419 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 10.5 శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు. బాలికల్లో సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. చాలామంది బాలికలు పాఠశాలల్లోనే ఉన్నారు. 9, 10వ తరగతి చదువుకుంటున్న బాలికలు చాలా మంది హాస్టళ్లలో ఉన్నారు. మార్చి నుంచే వార్షిక పరీక్షల హడావుడి ప్రారంభం కాగా బాలికలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. పరీక్షల సమయంలో వ్యాక్సిన్‌తో ఏదైన అనారోగ్యం బారిన పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో మరో నాలుగు రోజుల్లో వేసవి సెలవులు ప్రకటించనున్నారు. దీంతో టీకాల లక్ష్యం త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రయోజనాలెన్నో..
హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మహిళలు కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్ల బారినపడి వాటిని గుర్తించలేకపోతారు. సుదీర్ఘ కాలంగా చికిత్స చేయించుకోకపోవడంతో అది కాస్తా క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా మహిళలు అనారోగ్యం బారిన పడుతుంటారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ జిల్లాలోని అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. ఇదే వ్యాక్సిన్ బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉండగా.. ఒక్క టీకా సుమారు రూ.4000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. ఉచితంగా అందుబాటులో ఉన్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.


