షెల్టర్‌ లేక.. రోడ్డుపై నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

షెల్టర్‌ లేక.. రోడ్డుపై నిరీక్షణ

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తాలో బస్సు షెల్టర్‌ లేకపోవడంతో ప్రయాణికులు మండే ఎండల్లోనే నిరీక్షిస్తున్నారు. కూర్చునేందుకు కనీసం బెంచీలు లేక వృద్ధులు, మహిళలు, చిన్నారులు వేడి, ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. ఈ మార్గం గుండా బెజ్జూర్‌, దహెగాం, పెంచికల్‌పేట్‌, కౌటాలకు నిత్యం బస్సులు నడుస్తుంటాయి. మార్కెట్‌లో వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులు, విద్యార్థులు ఇక్కడే వేచి చూస్తుంటారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండటంతో తట్టుకోలేని కొందరు సంచులతో రోడ్డు పక్కన కింద కూర్చుకుంటున్నారు. ‘బస్సు రావడానికి అరగంట పట్టినా ఇక్కడే ఎండకు మాడాల్సిందే’ అంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి ఇదే సమస్య ఉన్నా మున్సిపల్‌, ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం తాత్కాలిక షెడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement