సాంకేతిక విద్య మిథ్యేనా? | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్య మిథ్యేనా?

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

ఇప్పటివరకు జిల్లాలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేయని ప్రభుత్వం టెక్నాలజీకి దూరమవుతున్న విద్యార్థులు ఉన్నత చదువులకు దూరప్రాంతాలకు.. జిల్లాలో కాలేజీల ఏర్పాటుకు డిమాండ్‌

తిర్యాణి: ఇప్పటికే అన్ని రంగాలతోపాటు విద్యారంగంలో వెనుకబడిన జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి సాంకేతిక విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం కాగజ్‌నగర్‌లో ఏకై క ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల మినహా జిల్లాలో మరెక్కడా ప్రభు త్వ, ప్రైవేట్‌ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు లేక సాంకేతిక విద్యారంగంలో జిల్లా వెనుకబడింది. విద్యార్థుల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

సాంకేతిక కోర్సులతో ఉద్యోగావకాశాలు

ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ కోర్సులు పూర్తి చేసినవారు తక్కువ సమయంలోనే ఉద్యోగావకాశాలు సాధించే అవకాశముంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌లో అడ్మిషన్‌ పొందే వెసులుబాటు ఉంది. ఇప్పటివరకు జిల్లాలో ఒకే ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల మాత్రమే ఉంది. ప్రభుత్వానికి చెందిన సాంకేతిక కళాశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జీవితంలో తొందరగా స్థిరపడాలనుకునే విద్యార్థులకు అందుకు అనువైన అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ కోర్సులు చదవాలంటే దూరప్రాంతలకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానికంగా ఉన్న సింగరేణి సంస్థలో వేతనంతో కూడిన శిక్షణ (అప్రెంటిస్‌షిప్‌) ఇవ్వడానికి ముందుకు వస్తుండటంతో పాటు ఆర్టీసీ లాంటి చాలా సంస్థలు కూడా ఐటీఐ విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు మొగ్గుచూపుతున్నాయి. అంతేకాకుండా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు సొంతంగా పరిశ్రమ పెట్టుకుని స్వయం ఉపాధితో స్థిరపడే అవకాశం ఉన్నందున ఐటీఐ లాంటి కోర్సులు చదివేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఎంతోమందికి ప్రయోజనం

వెనుకబడిన జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. స్థానికంగా కళాశాలలు లేకపోవడంతో వేరే జిల్లాలకు వెళ్లి ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు అభ్యసిస్తున్నారు. కాగా, జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఆరువేలకు పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కాగా, ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ సాంకేతిక కోర్సులు ఐటీఐ, పాలిటెక్నిక్‌లో చేరడానికి అర్హత ఉంటుంది. వీరితోపాటు ఇంటర్‌ పూర్తి చేసి సాంకేతిక కోర్సులపై ఆసక్తి ఉన్నవారూ ఐటీఐ, పాలిటెక్నిక్‌ అడ్మిషన్లు పొందే వెసులుబాటు ఉంది. కాగా, ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలున్నప్పటికీ దూరభారంతో పాటు సీట్లు కూడా సరిపోక జిల్లాలోని విద్యార్థులకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు.

సాంకేతిక విద్యాసంస్థలు నెలకొల్పాలి

జిల్లాలో సాంకేతిక కళాశాలలు లేక విద్యార్థులు సాంకేతిక కోర్సులు చదివేందుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. విద్యారంగంలో అత్యంత వెనుకబడిన జిల్లాను ముందు కు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదు.

– జగజంపుల తిరుపతి,

పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement