కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాల్టీ కో ఆప్షన్ పదవుల పంపకాల రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. నాలుగు కోఆప్షన్ స్థానాల కోసం మూడు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగాయి. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో ఖాళీగా ఉన్న నాలుగు కోఆప్షన్ పదవులకు 33 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు కోఆప్షన్ పదవుల్లో రెండు జనరల్ కోటాకు, ఒకటి మహిళలకు, మరొక టి మైనార్టీ పురుషులకు రిజర్వ్ చేశారు. కాగా, జనరల్ కోటాలో 15 మంది, మైనార్టీ కోటాలో 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన అనంతరం 20 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా 13 ఆమోదం పొందాయి. ఈ పదవులు దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారు.
ప్రతిష్టంభనలో ఎన్నికల నిర్వహణ
గతంలో బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. ఇప్పుడు అదే ఫార్ములాతో బీజేపీతో మైత్రి కొనసాగించి కో ఆప్షన్ పదవులు తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తోంది. అయితే, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న బీజేపీ–కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో అవగాహనకు వచ్చి పదవులు పంచుకుంటారని అంతా భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. పదవుల పంపకాల్లో రెండు పార్టీల మధ్య తేడాలు రావడంతో కో ఆప్షన్ ఎన్నికల నిర్వహణ ప్రతిష్టంభనలో పడింది. గతంలో ఈ పదవికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ, మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ఏ చిన్న పదవి అయినా దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నిక తాత్కాలికంగా వాయిదా
ఆసిఫాబాద్‌లో 28మంది దరఖాస్తు చేసుకోగా ఎనిమిది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 20 దరఖాస్తులు ఆమోదం పొందాయి. అయితే, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నాటి నుంచి 60 రోజుల్లోపు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. శనివారం వరకు ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి పక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. మైనార్టీ మహిళా కోట కింద దరఖాస్తు చేసుకున్న శ్రవంతాబాయి దరఖాస్తును అధికారులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం కూడా ఎన్నిక ఆలస్యానికి కారణమవుతుందనే చర్చ పట్టణంలో జోరుగా సాగుగుతోంది.


