● అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవులుగా ఈఎంటీలు ● 108 అంబులెన్స్‌ల ద్వారా మెరుగైన సేవలు ● ఏడాదిలో 16,696 కేసులకు స్పందన ● నేడు ఈఎంటీల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

● అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవులుగా ఈఎంటీలు ● 108 అంబులెన్స్‌ల ద్వారా మెరుగైన సేవలు ● ఏడాదిలో 16,696 కేసులకు స్పందన ● నేడు ఈఎంటీల దినోత్సవం

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

● అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవులుగా ఈఎంటీలు ● 108 అంబులెన్స్‌ల ద్వారా మెరుగైన సేవలు ● ఏడాదిలో 16,696 కేసులకు స్పందన ● నేడు ఈఎంటీల దినోత్సవం

వాంకిడి: ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందిస్తూ.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఎంతటి మారుమూల ప్రాంతానికై నా సేవలందిస్తూ 108 అంబులెన్స్‌ సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వాహనం ఘటనాస్థలికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నా కాలినడకన వెళ్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 15 వరకు 108 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో 33 మంది ఈఎంటీలు, 34 మంది పైలెట్‌(డ్రైవర్‌)లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఘటన స్థలానికి చేరడం, ప్రథమ చికిత్స చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. అత్యవసర సమయాల్లో గర్భిణులకు ప్రసవాలు జరిపించడం నుంచి రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి, రోగాల బారినపడి సాయం కోరే వారికి సేవలందిస్తున్నారు.

16,696 కేసులకు స్పందన

2025 జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 16,696 కేసులకు 108 సిబ్బంది స్పందించి రోగులను ఆస్పత్రులకు చేర్చారు. ఇందులో డెలివరీ కేసులు 540, రోడ్డు ప్రమాద కేసులు 1,794, గర్భిణుల కేసులు 4,975, కడుపునొప్పి కేసులు 1,741, పా యిజన్‌ కేసులు 840, వివిధ రకాల కేసులు 3,619 ఉన్నాయి. ప్రమాదం, ప్రసవ వేదన, జ్వరం, కడుపు నొప్పి, పాముకాటు, శ్వాసకోశ వ్యాధులు, గుండె నొప్పి, మూర్చ, స్పృహ కోల్పోవడం వంటి ఘటనలకు తక్షణ చికిత్స అందకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఈఎంటీలు వేగంగా ఘటన స్థలానికి చేరుతూ ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు నిలుపుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులకు 108 సేవలు వరంగా మారాయి. ప్రసవ నొప్పులు ప్రారంభం కాగానే కుటుంబ సభ్యులు నేరుగా 108కి ఫోన్‌ కాల్‌ చేస్తున్నారు. నొప్పులు పెరగడం, ఆస్పత్రికి తరలించేందుకు సమయం లేకపోతే మార్గమధ్యలోనే సిబ్బందే ప్రసవం చేస్తున్నారు. అనంతరం ప్రత్యేక చొరవ తీసుకుని తల్లీబిడ్డలను క్షేమంగా ఆస్పత్రులకు చేర్పిస్తున్నారు.

24 గంటలపాటు అందుబాటులో..

24 గంటలపాటు 108 సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసరంలో ఏ సమయంలోనైనా కాల్‌ చేసినా వెంటనే స్పందిస్తారు. ప్రమాద స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేస్తారు. అనంతరం సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రిలో చేర్పిస్తారు.

– మెరుగు నరేశ్‌యాదవ్‌, జిల్లా ప్రోగాం మేనేజర్‌

వెంటనే స్పందిస్తున్నాం

ఏడాదిన్నరగా 108 అంబులెన్స్‌లో ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్నాను. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే స్పందిస్తున్నాం. క్షణాల్లో బయలుదేరి క్షతగాత్రులకు ప్రథమ చికిత్స నిర్వహిస్తాం. ఆపదలో ఉన్న వారికి సేవలందించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది.

– ఎనగంటి ప్రవీణ్‌, ఈఎంటీ

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 108 సేవలను ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రమా దం జరిగినా వెంటనే సమాచారం అందించాలి. సిబ్బంది క్షణాల్లో స్పందించి సాంకేతికత ఆధారంగా ఘటన స్థలానికి చేరుకుంటారు. ఈఎంటీలు ప్రథమ చికిత్స అందిస్తారు.

– సామ్రాట్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌

ఆరేళ్లుగా సేవలు

ఆరేళ్లుగా ఈఎంటీగా సేవలందిస్తున్నా. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్యం అందించి ఆస్పత్రులకు చేర్పించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. విధి నిర్వహణలో డెలివరీ, రోడ్డు ప్రమాదాలు, తదితర కేసులకు స్పందించి ఘటన స్థలాలకు చేరుకుంటాం.

– అడ అజయ్‌, ఈఎంటీ

అనుకోని ప్రమాదాల బారిన పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి మేమున్నామని ఆపద్బాంధవులుగా ధైర్యాన్ని నింపుతూ 108 సిబ్బంది ఎనలేని సేవలందిస్తున్నారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే స్పందించి క్షణాల్లో గమ్యం చేరడంలో పైలెట్‌ల చాతుర్యం ఒకెత్తు అయితే.. ఆస్పత్రికి చేరేవరకు క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటంలో ఈఎంటీలు పాత్ర మరో ఎత్తు. ‘నీకేమీ కాదు.. నీకు నేనున్నాను’ అంటూ ధైర్యం కల్పిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు చేస్తున్నారు. గురువారం ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌(ఈఎంటీ)ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement