జిల్లావ్యాప్తంగా ఆయా రేంజ్‌ల పరిధిలోని 40 గ్రామాల్లో సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
నీటి ఎద్దడితో ఇబ్బందిపడే పది గిరిజన ఆదివాసీ గ్రామాల్లో చేతిపంపులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తిర్యాణి, గిన్నెధరి, జోడేఘాట్ గ్రామాలు, కెరమెరి, పెంచికల్‌పేట్, కాగజ్‌నగర్ మండలాల్లో ఒకటి చొప్పున, సిర్పూర్(టి) మండలంలో మూడు చొప్పున చేతిపంపులు ఏర్పాటు చేశారు.
గిరిజన గ్రామాల్లో 269 మందికి ఉచితంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేసి సిలిండర్లు అందించారు. మరో 101 మందికి ప్రతిపాదనలు పంపించారు. 138 మందికి ఉచితంగా నూతన గ్యాస్ కనెక్షన్లను అటవీశాఖ ఆధ్వర్యంలో అందజేశారు.
అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగేలా ప్రతీ రేంజ్ పరిధిలో 10 నుంచి 14 కిలోమీటర్ల రహదారులను అటవీశాఖ నిర్మించింది.
చింతలమానెపల్లి: ప్రజలతో మమేకమయ్యేందుకు జిల్లా అటవీశాఖ ఫ్రెండ్లీ ఫారెస్ట్ అనే కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. అడవుల్లో చెట్లు నరకడం, వన్యప్రాణుల వేట, పోడు సాగును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతుంది. సాధారణంగా అడవుల సమీప గ్రామాల్లోని అటవీ ప్రాంతంపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో చెట్లు నరకడం, వన్యప్రాణులను హతమార్చడం, పోడు భూముల సాగుతో అటవీ ప్రాంతాలు తగ్గిపోతున్నా యి. ప్రభుత్వ, అటవీశాఖ నిబంధనల ప్రకారం అనేక మందిపై కేసులు సైతం నమోదవుతున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు, ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో పలు రకాల క్రీడాపోటీలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ అటవీ శాఖ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది.
క్రీడాపోటీలకు ప్రాధాన్యం
జిల్లాలో 2,420 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లో ఖర్జెల్లి, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, బెజ్జూర్ రేంజ్‌లు ము ఖ్యమైనవి. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 98వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. ప్రజలతో సత్సంబంధాలు పెంచుకునే దిశగా కాగజ్‌నగర్ డివిజన్‌లోని అటవీ సమీప గ్రామాల్లో అధికారులు చురుగ్గా ఫెండ్లీ ఫారెస్ట్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రధానంగా యువతను ఆకర్షించడం ద్వారా గ్రామీణులకు అవగాహన కలిగించవచ్చని భావిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పులి పేరుతో గతంలో క్రీడాపోటీలను నిర్వహించారు. వ్యవసాయ పనులు లేని, సెలవులు ఉన్న సమయాల్లో వాలీబాల్ పోటీలు నిర్వహించడం ద్వారా ప్రజలు అడవుల వైపు వెళ్లకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
బాధ్యతతో పనిచేస్తున్నాం
అడవుల రక్షణ అందరి బాధ్యత. అధికారులతోపాటు ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ప్ర జల్లో అవగాహన తీసుకువచ్చేందుకు డివిజన్‌లో ఫ్రెండ్లీ ఫారెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యువతలో అవగాహన పెంచాలనేది మా ఆలోచన. సేవా కార్యక్రమాలతో ప్రజల అవసరాలను తీర్చాలనే బాధ్యతతో పనిచేస్తున్నాం.
– సుభాష్, ఖర్జెల్లి రేంజ్ అధికారి
ప్రజలు కూడా ముఖ్యమే
అటవీశాఖకు వన్యప్రాణులు, అడవులతోపాటు సమీపంలోని ప్రజలు కూడా ముఖ్యమే. ఆదివాసీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల సహకారం లేకుండా అటవీ సంరక్షణ అసాధ్యం. గిరిజనులు ఎదుర్కొనే ఇబ్బందులను ఉద్యోగులు ప్రత్యక్షంగా చూస్తుంటారు. ప్రజల సంరక్షణకు మా వంతుగా అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం.
– అప్పయ్య, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో
సేవా కార్యక్రమాలతో చేరువ
సేవా కార్యక్రమాలతో అటవీ అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. ఖర్జెల్లి రేంజ్ పరిధిలోని కేతినిలో గ్యాస్ కనెక్షన్లు అందించగా, గూడెంలో సోలార్ వీధి దీపాలను అమర్చారు. తిర్యాణి మండలం ఏదులపాడు గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు చేతిపంపుల నిర్మాణం చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలో నిర్వహించిన వైద్యశిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.


