పల్లెల్లో పైసల లొల్లి! | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పైసల లొల్లి!

Mar 25 2026 7:02 AM | Updated on Mar 25 2026 7:02 AM

రెండేళ్ల తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల తాజా సర్పంచులు, మాజీలు, కార్యదర్శుల వాదులాట గందరగోళంలో అధికారులు

కౌటాల: జిల్లాలోని గ్రామపంచాయతీలకు రెండేళ్ల తర్వాత విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు కొత్త పంచాయితీ తెచ్చిపెట్టాయి. ఆ నిధులు తమకంటే తమకని తాజా సర్పంచులు, తాజీ మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు వాదులాడుకుంటున్నారు. గత డిసెంబర్‌లో పదవీబాధ్యతలు చేపట్టిన సర్పంచులు ఆ నిధులు తమకే కావాలని పేచీ పెడుతుండగా.. తాము అప్పులు చేసి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక రెండేళ్లుగా వేచి చేస్తున్నామని, తమ బకాయిలు చెల్లించాలని తాజా మాజీ సర్పంచులంటున్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు తాగునీరు, విద్యుత్‌ బిల్లులు, పారిశుద్ధ్య పనులు, ట్రాక్టర్‌ డీజిల్‌, పరిపాలన నిర్వహణ ఖర్చులకు అప్పులు చేశామని చెబుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నామని, తమకు డబ్బులు కావాలని మరోవైపు పంచాయతీ కార్యదర్శలు కూడా అడుగుతున్నారు. ఇలా.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై పంచాయతీల్లో లొల్లి నడుస్తోంది. ప్రస్తుత పాలకులు, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బిల్లుల కోసం పట్టుబడుతుండడంతో చెల్లింపు జాప్యమవుతోంది.

జిల్లాకు రూ.25.22 కోట్లు

జిల్లాలోని 335 గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడతల వారీగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. రెండు విడతల్లో రూ.25.22 కోట్లు విడుదలయ్యాయి. నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటివరకు రూ.4కోట్లు ఖర్చయినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. అప్పటి సర్పంచులు పని చేసిన బిల్లులకు సంబంధించి తీర్మానాలు, ఎంబీ రికార్డులు ఉంటే పరిశీలించి.. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాస్తవమైతే మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించిందని మండల ప్రజాపరిషత్‌ అధికారులు పేర్కొంటున్నారు. తాము చేసిన పనుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ పాత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వచ్చిన కొద్దిపాటి నిధులతో పాత బకాయిలు చెల్లించాలా? గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలా? అని కొత్త సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని వారు అంటున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యేకాధికారుల పాలనలో ఖర్చు పెట్టిన పనులకే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయని, సర్కారు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు. పాత, కొత్త సర్పంచుల పైసల పంచాయితీ పక్కన పెట్టి అధికారులు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.

ముగ్గురి మధ్య పేచీ!

గత పాలకవర్గాల పదవీకాలం రెండేళ్ల కిత్రమే ముగిసింది. దీంతో రెండేళ్ల పాటు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామపంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖర్చులతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.లక్షల్లో అప్పులు తెచ్చి పెట్టినట్లు కార్యదర్శులు పేర్కొంటున్నారు. తాము పదవిలో ఉన్నపుడు గ్రామాభివృద్ధికి ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని తాజా మాజీ సర్పంచులు కోరుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన నూతన సర్పంచుల శిక్షణ తరగతుల్లో సర్పంచులు 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించేందుకు అవకాశమివ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు 2023–24, 2024–25 సంవత్సరాలకు గాను జిల్లాకు విడతల వారీగా విడుదలయ్యాయి. 2023–24 సంవత్సరానికి విడుదలైన నిధులు మాత్రమే మాజీ సర్పంచుల పదవీ కాలంలో చేసిన అభివృద్ధి పనులకు బి ల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అందులో నుంచి పంచాయతీ కార్యదర్శులు ఖర్చు పెట్టిన బిల్లులు తీసుకోవాలి. అయితే, ఈ బిల్లులు తాము హామీ ఇచ్చిన పనులకు ఇవ్వాలని తాజా సర్పంచులు, తాము పెట్టిన ఖర్చులకు ఇవ్వాలని మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య పేచీ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement