‘సిండికేట్‌’ దందా! | - | Sakshi
Sakshi News home page

‘సిండికేట్‌’ దందా!

Mar 21 2026 4:57 AM | Updated on Mar 21 2026 4:57 AM

వైన్స్‌ మామూళ్లు పెరగడంతో ఒక్కటైన వ్యాపారులు నెలనెలా పోలీసు, ఎకై ్సజ్‌, రాజకీయ నాయకుల వసూళ్లు రూ.లక్షల్లో ఖర్చులు ఉండటంతో నష్టాలు జిల్లా కేంద్రంలో వారం నుంచే అధిక ధరలకు మద్యం అమ్మకాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రూ.లక్షలు పోసి లక్కీడ్రాలో షాపులు గెలుచుకున్న మద్యం వ్యాపారులు అంతా ఒక్కటయ్యారు. ఆఫీసర్ల మామూళ్లు పెరగడంతో సిండికేట్‌గా మారి అక్రమ దందాలకు తెరలేపారు. 2025– 27 రెండేళ్లకు 32 షాపులు లైసెన్సులు పొంది గత డిసెంబర్‌ నుంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మామూళ్లు, ఇతర ఖర్చులకు పోను నిజాయతీగా నడిపితే మిగిలేది ఏం లేదని చెబుతూ ఆఫీసర్లకు పెద్దమొత్తంలో లంచాలు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆబ్కారీ శాఖకు రూ.లక్షల్లో లైసెన్సు ఫీజులు కట్టలేక.. ఇటు మామూళ్లు, ఖర్చులు తట్టుకుని సంపాదించేందుకు చివరకు సిండికేట్‌గా మారారు. దీంతో ఎమ్మార్పీపై అధికంగా చీప్‌ లిక్కర్‌ను రూ.పది చొప్పున ఎక్కువ రేటుతో అమ్ముతున్నారు. వీటితో పాటు బెల్టు షాపులకు రూ.10చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత డిసెంబర్‌ నుంచే షాపులు మొదలు కాగా ఎవరికి వారే అమ్ముకున్నారు. అయితే గత నాలుగు నెలలుగా షాపులకు నష్టాలు రావడంతో ఈ నెల 15నుంచే ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆరు వైన్స్‌లు సిండికేట్‌గా మారాయి. ఇప్పటికే వాంకిడి, కెరమెరి మండలాల్లో సిండికేట్‌ మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చింతలమానెపల్లి మండలం గూడెంలోనూ మహారాష్ట్ర సరిహద్దులో అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇక కాగజ్‌నగర్‌ పట్టణంలో కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పెరిగిన మామూళ్లు

గతంలో కంటే పోలీసు ఆఫీసర్లు తమ మామూళ్లు పెంచుకున్నారు. దీంతో మద్యం వ్యాపారులు నెలనెలా రూ.లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలో రూ.10వేల చొప్పున ఇస్తే ఇప్పుడు రూ.16వేలకు చేరింది. వీరికి తోడు కిందిస్థాయి, డివిజన్‌, ఆపై ఉన్నతాధికారికి సైతం ఆ స్థాయిలోనే పంపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు పోలీసు శాఖకే సుమారు రూ.40నుంచి రూ.50వేల దాక పోతున్నాయి. ఇక ఆబ్కారీ అధికారులకు కింది నుంచి పైదాక మరో రూ.30వేల దాక అందుతున్నాయి. వీరికి తోడు రాజకీయ నాయకులు సైతం అడుగుతుండడంతో మద్యం వ్యాపారులకు నెలకు రూ.లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఖర్చులతో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయిస్తుండటంతో అంతిమ వినియోగదారుడైన మందుబాబులకు జేబులకు చిల్లు పడుతోంది.

ఇవ్వకపోతే కేసులే !

నెలనెలా మామూళ్లు ఇవ్వకపోతే మద్యం షాపులకు ప్రధాన వనరుగా ఉన్న బెల్ట్‌ షాపులను లేకుండా చేస్తామని హెచ్చరికలు వచ్చాయి. అంతేకాక షాపుల ఎదుట న్యూసెన్స్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌, పార్కింగ్‌ తదితర ఉల్లంఘనల కింద చట్ట వ్యతిరేకంగా అమ్ముతున్నారంటూ కేసులు పెడతామని హెచ్చరించారు. మొదట మొత్తం ఆరు దుకాణాలకు రూ.1.20 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ఓ అధికారి హెచ్చరికలు చేశారు. అంత ఇచ్చుకోలేమని చెబితే, చివరకు రూ.16 వేల చొప్పున మాములుకు ఒప్పుకున్నారు. గత డిసెంబర్‌ నుంచి ఎవరికి వారే అమ్ముకోగా.. వారం క్రితం తప్పని పరిస్థితుల్లో సిండికేట్‌ అయ్యామని వ్యాపార వర్గాల్లో చర్చ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement