ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, కమిషనర్ గజానంద్, వైస్ చైర్మన్ అహ్మద్ తెలిపారు. కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, సాలం బిన్ అహ్మద్, మైనార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించారు. వసతుల కల్పన పనులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ నమాజ్‌కు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో షామియానాలు ఏర్పాటు చేస్తున్నామని, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఉస్మానియా మసీద్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, నాయకులు సయ్యద్ అన్సార్, నిసార్, అబ్దుల్ రహమాన్, సమద్ సయ్యద్, అమర్ బిన్ అహ్మద్, జావిద్, షబ్బీర్, సల్మాన్‌ఖాన్, మతిన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


