కొత్త రైలు కూతేది.? | - | Sakshi
Sakshi News home page

కొత్త రైలు కూతేది.?

Nov 28 2025 8:43 AM | Updated on Nov 28 2025 8:43 AM

కొత్త రైలు కూతేది.?

కొత్త రైలు కూతేది.?

దశాబ్దాలుగా మారని ఆసిఫాబాద్‌ రోడ్‌ స్టేషన్‌ దుస్థితి దూరప్రాంత ప్రయాణాలకు ఇతర స్టేషన్లకు వెళ్లాల్సిందే.. కొత్త వాటి హాల్టింగ్‌ కోసం తప్పని నిరీక్షణ

రెబ్బెన(ఆసిఫాబాద్‌): దశాబ్దాలు గడుస్తున్నా కీలకమైన ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ పరిస్థితి మారడం లేదు. నిజాం కాలంలో ఏర్పాటు స్టేషన్‌లో కొత్త ట్రైన్లకు హాల్టింగ్‌ ఇవ్వడం లేదు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఒక్కగానొక్క స్టేషన్‌కు ఘనమైన చరిత్ర ఉన్నా నిరాద రణకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నుంచి కొనసాగుతున్నవే తప్పా కొత్తవాటికి హాల్టింగ్‌ సౌకర్యం కల్పించడం లేదు. ఇంటర్‌ సిటీ మినహా రైళ్లన్నీ ప్యాసింజర్‌ స్థాయివి కావడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

ప్యాసింజర్‌ రైళ్లే దిక్కు..

జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైనా ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి కానరావడం లేదు. ఈ స్టేషన్‌ గుండా నిత్యం వందలాది మంది ప్రయాణికులు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్‌ మండలాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటం, జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఆసిఫాబాద్‌ జిల్లాగా ఏర్పాటు కావడంతో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. ప్యాసింజర్‌ రైళ్లు మినహా ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ పేర్లతో పిలుస్తున్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మినహా మిగిలినవన్నీ ప్యాసింజర్‌ స్థాయి రైళ్లే.. అవి కూడా సికింద్రాబాద్‌, కాజీపేట, కొత్తగూడెం, కరీంనగర్‌, సిర్పూర్‌ టౌన్‌ మధ్య మాత్రమే నడుస్తున్నాయి. గతంలో ఈ స్టేషన్‌లో ఆగిన ఆజ్నీ, సింగరేణి, నాగ్‌పూర్‌ ప్యాసింజర్లకు కరోనా తర్వాత హాల్టింగ్‌ సైతం ఎత్తివేశారు. దీంతో విజయవాడ, తిరుపతి, చైన్నె, నాగ్‌పూర్‌ వంటి దూరప్రాంతాలకు వెళ్లేందుకు కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లపై ఆధారపడుతున్నారు. సమయంలోపాటు డబ్బులు వృథా అవుతున్నాయి.

దశాబ్దాల క్రితం మంజూరైనవే..

ఆసిఫాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆగే రైళ్లలన్నీ కొన్ని దశాబ్దాల క్రితం మంజూరు చేసినవే ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం గోలేటి, జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌, మండల కేంద్రాల నుంచి వ్యక్తిగత పనులు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, ఇతర అవసరాల కోసం సూదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో గుజరాత్‌, రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వారు వేలల్లో ఉంటారు. ఇటీవల కాగజ్‌నగర్‌తోపాటు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో వందేభారత్‌తోపాటు పలు రైళ్లకు కొత్తగా హాల్టింగ్‌ సౌకర్యం కల్పించారు. ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి అయ్యే బొగ్గును గోలేటి సీహెచ్‌పీ ద్వారా సింగరేణి యాజమాన్యం రైలుమార్గంలో సరఫరా చేస్తోంది. దీంతో ఆసిఫాబాద్‌ స్టేషన్‌కు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ప్రయాణికుల టికెట్ల ద్వారా కొంతమేర ఆదాయం సమకూరుతున్నా కొత్త రైళ్ల హాల్టింగ్‌కు మోక్షం కలగడం లేదు.

ప్రస్తుతం ఆసిఫాబాద్‌ రోడ్‌

స్టేషన్‌లో ఆగుతున్న రైళ్లు

కాజీపేట వైపు..

భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌

ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌

కరీంనగర్‌ మెమో

సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ భద్రాచలం

రామగిరి ఎక్స్‌ప్రెస్‌

బల్లార్షా వైపు..

రామగిరి ఎక్స్‌ప్రెస్‌ (సిర్పూర్‌ టౌన్‌ వరకు)

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (కాగజ్‌నగర్‌ వరకు)

కరీంనగర్‌ మెమూ (సిర్పూర్‌ టౌన్‌ వరకు)

భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (కాగజ్‌నగర్‌ వరకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement