సమ్మె చేస్తేనే వేతనాలు!
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తేగానీ వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసినా రెండు నెలల జీతాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని, పూట గడవక అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
నెలనెలా అందక అవస్థలు
కాగజ్‌నగర్ బల్దియా పరిధిలో 141 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతినెలా వేతనాల రూపంలో రూ.21 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ నెలనెలా గడువులోగా వేతనాలు చెల్లించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా ఏ నెల కూడా సక్రమంగా జీతాలు అందడం లేదు. మున్సిపాలిటీలో నిధుల కొరతతోపాటు ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువగా ఉండడంతో నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను సంప్రదించగా 15 రోజుల్లో వేతనాలను అందిస్తామని చెప్పారని కార్మికులు వెల్లడించారు.


