సరిహద్దు పల్లెల్లో సందడి
తొలి విడతలోనే వివాదాస్పద గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో మహారాష్ట్ర ఎలక్షన్స్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ఓటు వేయనున్న ప్రజలు
కెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు చర్చలోకి వస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ నుంచి.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ గ్రామాలపై ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కెరమెరి మండలంలోని సరిహద్దు పల్లెల్లో సందడి నెలకొంది. తొలి విడతలో భాగంగా డిసెంబర్ 11న అక్కడ పోలింగ్ జరగనుంది.
14 గ్రామాలు.. 3,456 మంది ఓటర్లు
కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకదంగూడ పంచాయతీలు ఏళ్లుగా రెండు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని పరంధోళి, కోటా, పరందోళి తండా, ముకదంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరి గ్రామాలు ఎవరి ఆధీనంలో ఉండానే విషయంలో వివాదం ఉంది. ప్రతీ పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉన్నాయి. 3,456 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వీరు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం కెరమెరి మండలంలోని ఎనిమిది క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పరంధోలి, ముకదంగూడ, అంతాపూర్ పంచాయతీలు పరంధోళి క్లస్టర్‌లో ఉండగా, బోలాపటార్ జీపీ కెలి– బి క్లస్టర్‌లో ఉంది. రిజర్వేషన్లలో భాగంగా అంతాపూర్ జీపీ జనరల్ మహిళ, భోలాపటార్ ఎస్టీ మహిళ, ముకదంగూడ ఎస్టీ మహిళ, పరంధోలి జనరల్‌కు కేటాయించారు.
తొలిరోజు నామినేషన్లు నిల్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద గ్రామాల్లో గతంలో పోటీ చేసినవారితో పాటు యువతరం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం నాలుగు జీపీల పరిధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆశావహులు నామినేషన్ పత్రాలను ఇళ్లకు తీసుకెళ్లారు. పరంధోలి, అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల్లో సర్పంచ్ స్థానం కోసం ఐదు లేదా ఆరుగురు, ముకదంగూడలో ముగ్గురు పోటీలో ఉండే అవకాశం ఉంది.
జనవరిలో మళ్లీ ఎన్నికలు..!
2024 నవంబర్ 20 మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. 2,985 మంది ఓటర్లకు 1,852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా డిసెంబర్ 11న తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో స్వల్ప వ్యవధిలోనే ప్రజలు రెండుసార్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


