
వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శులు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, వీవోఏలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్(వానాకాలం) సీజన్ వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లాలో 44వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, దాదాపు 30వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్నారు. ఈనెల 24లోగా 40 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం రూ.2,369 మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తేమ శాతం నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.కొనుగోలు కేంద్రాలను ఎత్తుప్రదేశంలో ఏర్పాటు చేయాలని, సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయ్యర్లు, తేమశాతం యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ట్యాబ్‌లను అందుబాటులో ఉంచి, రైతుల వద్ద నుంచి క్రమపద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం ట్యాగింగ్ చేసిన రైస్‌మిల్లులకు మాత్రమే తరలించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరగా దిగుమతి చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.