
ఐటీడీఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న దినసరి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గురువారం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సవ్యసాచి ఘోష్‌కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 30 ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంతా గిరిజనులే అయినా ఇప్పటివరకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు. సకాలంలో వేతనాలు అందించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.