
లక్ష్య సాధనపై గురి!
బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తిపై అధిక వర్షాల ప్రభావం నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన యాజమాన్యం వర్షాలు తగ్గడంతో ఉత్పత్తిలో వేగం పెంచిన అధికారులు లక్ష్యానికి మించి ఓబీ వెలికితీత పనులు
సంవత్సరం లక్ష్యం సాధించింది శాతం
2021– 22 33.50 24.42 73
2022– 23 35.00 29.20 83
2023– 24 36.50 37.50 103
2024– 25 38.50 37.50 97
2025– 26 16.32 13.70 84
(అక్టోబర్ 14 వరకు)
రెబ్బెన(ఆసిఫాబాద్): ఓసీపీలపై అధిక వర్షాలు తీవ్ర ప్రభావం చూపడంతో బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నెలవారీ ఉత్పత్తి సాధన కోసం అధికారులు చర్యలు చేపట్టినా వాతావరణం సహకరించకపోవడంతో ఉత్పత్తి పరంగా నష్టాలు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్లంపల్లి ఏరియాలో ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. గోలేటి ఓసీపీ ఇంకా ప్రారంభం కాకపోవడంతో భారమంతా ఖైరిగూర ఓసీపీపైనే ఉంది. జిల్లాలో గతేడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు 1,207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి 1,829 మిల్లీమీటర్లుగా నమోదైంది. గడిచిన రెండు నెలల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏరియా వార్షిక లక్ష్యంపై ప్రభావం ప డింది. సెప్టెంబర్‌లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో నెలవారీ ఉత్పత్తి లక్ష్యంలో కేవలం 37 శాతం మాత్రమే సాధించగలిగారు. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల్లో నాలుగు లక్షల టన్నులకు కేవలం 2.74 లక్షలు మాత్రమే సాధ్యమైంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని నెలవారీ ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించినా పూర్తిస్థాయిలో సాధించలేకపోయారు.
ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు
20225– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బెల్లంపల్లి ఏరియాకు 35లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని యాజమాన్యం లక్ష్యం విధించింది. గత సంవత్సరం వార్షిక లక్ష్య సాధనలో అడుగు దూరంలో బెల్లంపల్లి ఏరియా నిలిచింది. దీంతో ఈసారి వందశాతం ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వర్షాలు ఉత్పత్తి పరంగా ఏరియాను కుదేలు చేసినా సవాళ్లను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 14 నాటికి బెల్లంపల్లి ఏరియా వార్షిక ఉత్పత్తి సాధనలో 84 శాతంలో ఉంది. వర్షాలు తగ్గడంతో ఉత్పత్తిలో వేగం పెంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఏరియా రోజువారీ ఉత్పత్తి లక్ష్యం 10వేల టన్నులు ఉండగా డిసెంబర్ నుంచి 12వేల వరకు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదనపు ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించడం ద్వారా వర్షాకాలంలో కోల్పోయిన ఉత్పత్తి నష్టాన్ని తిరిగి సాధించనున్నారు.
వేగంగా ఓబీ వెలికితీత
ఓపెన్ కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగాలంటే అందుకు అవసరమైన బొగ్గు బెంచీలు అందుబాటులో ఉండాలి. ఓబీ పనులు అనుకూలంగా సాగాలి. అనుకున్న రీతిలో ఓబీ తీసినప్పుడే బొగ్గు బెంచ్‌లు సిద్ధంగా ఉంటాయి. సింగరేణిలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ వెలికితీత పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలు పనులను మధ్యలోనే వదిలేస్తూ చేతులెత్తేశాయి. దీంతో శ్రీరాంపూర్ ఓసీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కానీ బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో ఓబీ వెలికితీస్తున్న కాంట్రాక్టు సంస్థ రోజు వారీ లక్ష్యానికి మించి ఓబీ వెలికితీస్తోంది. ప్రస్తుతం ఓబీ రోజువారీ లక్ష్యం 1.2లక్షల క్యూబిక్ మీటర్లు ఉండగా.. కాంట్రాక్ట్ సంస్థ రోజుకు 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఓబీ తొలగిస్తోంది. దీంతో ఏరియాలో డిసెంబర్ నుంచి వందశాతానికి మించి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యంత్రాల పని గంటలను పెంచడం, రోజువారీ వార్షిక లక్ష్యాన్ని పెంచడం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
ఐదేళ్లలో బెల్లంపల్లి ఏరియా సాధించిన ఉత్పత్తి వివరాలు(లక్షల టన్నుల్లో)
వందశాతం లక్ష్యం సాధిస్తాం
గతేడాదితో పోల్చితే ఈసారి ఏరియాలో అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగం ఉత్పత్తిని కూడా సాధించలేకపోయాం. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు నిర్దేశించిన లక్ష్యం వందశాతం సాధిస్తాం. ఏరియాకు ఈసారి 35 లక్షల టన్నుల లక్ష్యం ఉంది. అక్టోబర్ 14 వరకు ఏరియా 16.32 లక్షల టన్నులకు 13.66 లక్షల టన్నులు సాధించి 84శాతంలో ఉన్నాం. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం.
– విజయ భాస్కర్‌రెడ్డి, జనరల్ మేనేజర్, బెల్లంపల్లి ఏరియా

లక్ష్య సాధనపై గురి!