
నిబంధనలకు పాతర!
కాగజ్‌నగర్‌టౌన్: దీపావళి పండుగ సమీపిస్తోంది. ఓ వైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతోపా టు దీపావళి పండుగ ఉండటంతో కాగజ్‌నగర్ పట్టణంలో నిత్యావసరాల మాటున ఇప్పటికే పెద్దఎత్తున బాణాసంచా నిల్వలు చేరుకున్నట్లు సమాచా రం. అయితే విక్రయదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్‌లు పొందకుండానే తాత్కాలికంగా ఎన్‌వోసీ లెటర్ తీసుకుని పట్టణంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాల ఏర్పాటుకు రెవె న్యూ, వాణిజ్య పన్నుల శాఖ, పోలీసుల అనుమతులు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భా రీగా గండి పడుతోంది. అధిక ధరలకు టపాసులు విక్రయించి సొమ్ము చేసుకునేలా వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది.
రెండు శాఖల నుంచి ఎన్‌వోసీ..
దీపావళి పండుగకు బాణాసంచా విక్రయించేందుకు పట్టణంలోని వినయ్‌గార్డెన్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏ ర్పాటు చేస్తున్నారు. బురదగూడ గ్రామ అగ్నిమాప క శాఖ, పంచాయతీ నుంచి ఏడు దుకాణాలకు ఇప్పటివరకు కేవలం ఎన్‌వోసీ లెటర్ మాత్రమే తీసుకున్నారు. షాపులు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దుకాణాల మధ్య దూరం పెంచి ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించాలి. లైసెన్సులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనలు పాటించాలి
ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా బాణాసంచా నిల్వలు ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటాం. సేఫ్టీ నిబంధనల ప్రకారమే దుకాణాలు ఏ ర్పాటు చేసుకోవాలి. షాపుల మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. నీరు, ఇసుక, అగ్నిమాపక సిలిండర్ అందుబాటులో ఉంచాలి.
– భీమయ్య, ఫైర్ ఆఫీసర్, కాగజ్‌నగర్