
అర్ధాకలి చదువులు!
జూనియర్ కాలేజీల్లో అమలు కాని ఎండీఎం రోజంతా పస్తులుంటున్న వైనం అటకెక్కిన గత ప్రభుత్వ హామీ అమలు చేయాలని విద్యార్థుల విన్నపం
ఇంటర్ విద్యార్థులు..
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. విద్యార్థులు ప్రతీరోజు కళాశాలకు వచ్చేలా ఇటీవల ఎఫ్‌ఆర్‌ఎస్ కూడా అమలు చేసింది. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుల కోసం మండల కేంద్రాలకు వస్తున్న ఇంటర్ విద్యార్థులు ఖాళీకడుపులతో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు రోజంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. జూనియర్ కళాశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. కళాశాలకు వచ్చే కొందరు విద్యార్థులు అప్పుడప్పుడు లంచ్ బాక్సు తీసుకొస్తుండగా, మరికొందరు ఉదయం ఇళ్ల వద్దే భోజనం చేసి వస్తున్నారు. బాక్సు తెచ్చుకోని విద్యార్థులు కళాశాల ముగిసే వరకు ఆకలితో ఉంటున్నారు. దీంతో అధ్యాపకులు చెప్పే పాఠాలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 4,625 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఏటా తగ్గుతున్న విద్యార్థులు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎండీఎం అమలు చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజనం అమలుకు ఎంత ఖర్చవుతుందనే వివరాలు సైతం సేకరించారు. కానీ పథకం అమలు మాత్రం జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల వినతులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎండీఎం అమలు కాక ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
చిరుతిండ్లతో సరి..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా వరకు పేద విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం విరామంలో స్నాక్స్, పండ్లు, టీ, కాఫీలతో తమ ఆకలిని కొంత వరకు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
గతంలో మూడు నెలలు..
2020 –21 విద్యాసంవత్సరంలో అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జనవరి నుంచి మార్చి వరకు కలెక్టర్ నిధులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అలాగే 2022 –23లో అప్పటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డీఎంఎఫ్‌టీ నిధులతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మార్చి వరకు వార్షిక పరీక్షల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందించారు. సిర్పూర్(టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాగజ్‌నగర్ డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరూ కూడా కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పంపిణీ చేయలేదు.
ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు: 617
ఒకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థులు : 491
జిల్లాలోని జూనియర్ కళాశాలల వివరాలు..