
భవితవ్యం.. ప్రశ్నార్థకం
శిథిలావస్థకు చేరిన సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ గురుకులం నెలలు గడుస్తున్నా ప్రారంభంకాని మరమ్మతులు ఇతర పాఠశాలల్లో విద్యార్థుల సర్దుబాటు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది. భవన సముదాయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో జూలై 29న ఖాళీ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అనంతరం వారిని ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గురుకుల భవనానికి మరమ్మతులు చేపట్టలేదు. తాత్కాలిక భవనాల కోసం అధికారులు గాలిస్తున్నారు. భవనం ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకోలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఐదు గురుకులాలకు విద్యార్థులు
సిర్పూర్(టి) గురుకుల పాఠశాల, కళాశాలలో మొ త్తం 640 మంది విద్యార్థులకు పరిమితి ఉండగా ప్ర స్తుతం 490 మంది చదువుతున్నారు. భవనం శిథి లావస్థకు చేరడంతో 490 విద్యార్థులను ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాసిపేట, జైపూర్‌తోపాటు కోరుట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు తరలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. మొదట భారీ వర్షాలతో విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఆ తర్వాత ఇతర గురుకులాలకు పంపించడంతో విద్యా సంవత్సరం మధ్యలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్ల కోసం కౌటాల మండలం విజయనగరం గ్రామంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. భవనం మార్పునకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, తమకు సమాచారం లేదని గురుకులాల అధికారులు చెబుతున్నారు.