
విజన్ 2030తో గిరిజనుల సంక్షేమం
ఆసిఫాబాద్: విజన్ 2030తో జిల్లాలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వాంకిడి మండలం లింబుగూడ ప్రాంతంలోని బహుళార్థక ప్రయోజన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రధానమంత్రి జన్‌మన్ పథకం ద్వారా పీవీటీజీలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ కుటుంబాలకు అధునాతన పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. గిరిజన పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరాలను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించడంతో పాటు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులు, సమావేశాలు, సాంస్కృతిక కూటములతో గిరిజనుల మధ్య సత్సంబంధాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా చిత్రాలను రూపొందించడంతో పాటు పురాతన లోహపు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.