
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత
కౌటాల(సిర్పూర్): అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కౌటాల సర్కిల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. కార్యాలయ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రేవ్ కేసులను నాణ్యమైన దర్యాప్తు చేసి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. హత్యలు, డౌరీ డెత్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేరాలను అదుపునకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ హాట్‌స్పాట్లుగా గుర్తించాలన్నారు. గంజాయి, ఇతర అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట కాగజ్‌నగర్ డీఎస్పీ వహిద్దుదీన్, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.