
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
దహెగాం(సిర్పూర్): విద్యుత్ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిజామాబాద్ చైర్‌పర్సన్ ఎరుకుల నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో బుధవారం విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, అధిక లోడ్ ఉన్నచోట మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలను ప్రజలు విన్నవించారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. వ్యవసాయ కనెక్షన్లు, అధిక లోడ్ ఉన్న చోట ప్రత్యామ్నాయంగా మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యవసాయ మోటర్లకు కెపాసిటర్ బిగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ అధికారి కిషన్, ఎస్‌ఈ శేషారావు, డీఈ నాగరాజు, ఏవో దేవీదాస్, ఏఏవో రాజమల్లు, ఏఈ రవీందర్ పాల్గొన్నారు.