
పాతాళ గంగ ౖపైపెకి!
జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు అధిక వర్షాలతో నిండిన బావులు, చెరువులు సత్ఫలితాలు ఇచ్చిన నీటి సంరక్షణ చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో పాతాళ గంగ పైకొచ్చింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సగటున ఒక మీటర్ నీటిమట్టం పెరిగింది. కాగా, జిల్లాలో ప్రతీ ఏడాది 0.5 నుంచి 0.7 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం గ్రౌండ్‌వాటర్ 8 నుంచి 10 మీటర్ల లోతులోనే ఉండేవి. కొన్నేళ్లుగా ఎండలు పెరగడం, సాగు కోసం అత్యధికంగా బోర్లు వినియోగించడంతో భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలకు పాతాళ గంగ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
మే నుంచి పెరుగుదల
జిల్లాలోని 15 మండలాల్లో భూగర్భజల మట్టాలను కొలిచేందుకు 31 ప్రాంతాల్లో ఫిజోమీటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో గతేడాది నవంబర్‌లో సగటున భూ గర్భ జలాలు 6.13 మీటర్ల లోతులో ఉండగా, ఈ యేడాది 4.57 మీటర్లకు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 5.91 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది 3.85 మీటర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మే నుంచి పెరుగుదల కనిపిస్తోంది. మేలో 9.53 మీటర్లు ఉండగా, జూన్‌లో 8.48, జూలై 5.91, ఆగస్టు 4.57, సెప్టెంబర్‌లో 3.85 మీటర్లకు చేరాయి.
నీటి సంరక్షణ చర్యలతోనే..
అధిక వర్షాలతోనే జిల్లాలో భూ గర్భ జలాలు పెరిగాయి. నీటి సంరక్షణకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, ప్రాంతాన్ని బట్టి చెరువులు, ఇంకుడు గుంతలతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం.
– సుహాసిని, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి
సెప్టెంబర్‌లో భూగర్భ జల మట్టం వివరాలు
ప్రాంతం లోతు(మీటర్లలో)
ఆసిఫాబాద్ 9.86
ఆసిఫాబాద్– 2 7.35
కొమ్ముగూడ 0.17
బెజ్జూర్ 1.70
రెబ్బెన 1
పాపన్‌పేట్ 2.60
దహెగాం 15.15
రాసిమెట్ట 0.55
సిర్పూర్(యూ) 0.57
జంబుగ 4
కాగజ్‌నగర్ 0.50
భీమన్‌గోంది 6.43
కెరమెరి 3.30
ఝరి 4.85
కౌటాల 1.67
లొద్దిగూడ 0.46
రవీంద్రనగర్ 0.65
కర్జవెల్లి 0.99
ఎల్కపల్లి 13.40
రెబ్బెన–1 3.29
రెబ్బెన– 2 4.72
సిర్పూర్(టి) 0.02
లోనవెల్లి 1.21
చింతకుంట 5.59
భీమ్‌పూర్ 1.60
పంగిడిమాదర 2.70
తిర్యాణి 8.25
సవాతి 5.90
వాంకిడి 5.05
కనర్‌గాం 3.66
ఇందాని 2.01
అధిక వర్షపాతం నమోదు..
భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం వర్షపు నీటి సంరక్షణ, చెరువుల్లో పూడికతీత పనులతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. గ్రామాల్లో నీటి గుంతలు నిర్మిస్తున్నారు. జిల్లాలో కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్, అమ్మలమడుగు, తదితర జలాశయాల్లో నీటి నిల్వలతో భూగర్భ జలాలు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 1025.6 మిల్లీమీటర్లు కాగా 1175.1 మిల్లీమీటర్లు కురిసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1076.1 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 1364.8 మిల్లీమీటర్లు కురిసింది. 27 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఇది భూగర్భ జలాల పెంపునకు దోహదపడింది.