
సమ్మె వీడని కార్మికులు
33వ రోజుకు డైలీ వేజ్ కార్మికుల సమ్మె గిరిజన వసతిగృహాల్లోని విద్యార్థులకు తప్పని తిప్పలు
ఔట్‌సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. 2012 జీవో సవరించి 2014 వరకు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని క్రమబద్ధీకరించాలి.
పేస్కేల్ వెంటనే అమలు చేయాలి. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తూ.. పెండింగ్ వేతనాలు వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి.
ప్రమాద బీమా రూ.10లక్షలు చెల్లించాలి. చనిపోయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
పని భారానికి అనుగుణంగా సిబ్బందిని నియమించాలి. ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి.
పెంచికల్‌పేట్(సిర్పూర్): జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి(డైలీ వేజ్) కార్మికులు సమ్మె వీడటం లేదు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకి చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిత్యం నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం వద్ద 72 గంటల నిరసన సైతం చేపట్టారు. మరోవైపు దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు వసతిగృహాలకు చేరుకుంటున్నారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో వసతిగృహాల నిర్వహణకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు, విద్యార్థులకు భోజనం వండటంతోపాటు ఇతర పనులు చేపట్టేందుకు తాత్కాలిక కార్మికులను నియమించుకుంటున్నారు.
నెలరోజులుగా సమ్మెబాట
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 46 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 11,560 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా వసతిగృహాల్లో పారిశుద్ధ్య పనులు, భోజనం వండటం, ఇతర పనుల కోసం సుమారు 15 ఏళ్ల క్రితం ఔట్‌సోర్సింగ్ విధానంలో కార్మికులను నియమించారు. ప్రస్తుతం జిల్లాలో డైలీవేజ్ కార్మికులు 410 మంది పనిచేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్లలో పనిచేస్తున్న వీరంతా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023లో సమ్మె బాట పట్టారు. అధికారులు, ప్రభుత్వం ఇచ్చిన హామీతో అప్పుడు సమ్మె విరమించారు. హామీలు అమలు చేయకపోవడంతో తిరిగి సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మెబాట చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు..