
కాగజ్‌నగర్ అడవుల్లోకి బెబ్బులి
దహెగాం/కాగజ్‌నగర్‌రూరల్: దహెగాం మండలంలోని పెసరికుంట, బీబ్రా సమీపంలో సోమవారం సంచరించిన పెద్దపులి కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోకి వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పెద్దపులి జాడను ఈజ్‌గాం, అనుకోడ, గన్నారం, మండువ అటవీ ప్రాంతంలో మొదట గుర్తించారు. రెండు రోజుల క్రితం రాస్పెల్లి, కొత్తసార్సాల, పాతసార్సాల మీదుగా పెద్దవాగు దాటి బీబ్రా ప్రాంతానికి వెళ్లింది. పెసరికుంట, బీబ్రా గ్రామాల మీదుగా భీమిని మండలం చినగుడిపేట వరకు చేరుకుని మళ్లీ మంగళవారం పెద్దవాగు దాటి రాస్పెల్లి బీట్ పరిధిలోని అడవుల్లోకి వెళ్లినట్లు ఎఫ్‌ఎస్‌వో సద్దాం తెలిపారు. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు గుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు.
గ్రామాల్లో డప్పు చాటింపు
రాస్పెల్లి, కొత్తసార్సాల, పాత సార్సాల, చేడ్వాయి, దరోగపల్లి, గజ్జిగూడ, మోసం, ఆరెగూడ, బాపూనగర్, కడంబ, గన్నారం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు డప్పు చాటింపు వేస్తున్నారు. పులి జాడను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు నిఘా ఏర్పాటు చేసినట్లు ఎఫ్‌ఆర్వో అనిల్‌కుమార్ వెల్లడించారు. పులి చాలా చురుకుగా ఉందని సీసీ కెమెరాలు అమర్చిన చోటు నుంచి కాకుండా దాని వెనుకవైపు నుంచి వెళ్తుందని తెలిపారు.
సల్పలగూడలో పులి సంచారం!
ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ పరిధిలోని సల్పలగూడ భీమన్న ఆలయం వద్ద మంగళవారం సాయంత్రం పులి సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో పంచా యతీ కార్యదర్శి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు వేయించారు. కొన్నిరోజులుగా తి ర్యాణి మండలంలో పులి సంచరిస్తోందని, అదే ఇ టువైపు రావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.