
దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్: భూసమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు, రహదారుల నిర్మాణాల్లో ముంపునకు గురైన భూముల వివరాలు, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు సీలింగ్ భూములు, నిషేధిత జాబితాలోని భూముల వివరాలతో స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును రికార్డులతో సరిచూసి సంబంధిత వారసులు, దరఖాస్తుదారుడికి నోటీసులు అందించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
‘బెస్ట్ అవైలబుల్’ విద్యార్థులపై దృష్టి సారించాలి
ఆసిఫాబాద్‌రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వి ద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. వస తి గృహాల్లో సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ అధి కారి నదీమ్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికా రి మండల్ తదితరులు పాల్గొన్నారు.