
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
రెబ్బెన: క్రీడాకారులు పోటీల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని బెల్లంపల్లి ఏరియా ఎస్టేట్స్ అధికారి వి.సాగర్ అన్నారు. శనివారం గోలేటిలోని భీమన్న స్టేడియంలో 92వ డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా డిపార్టుమెంట్ బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను పట్టించుకోకుండా నిరంతరం సాధన చేస్తే విజయాలు సొంతం అవుతాయన్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగ క్రీడాకారులు మంచి క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో ఖైరిగూడ పీవో జట్టుపై ఎస్‌వోటూ జీఎం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమాల్లో సీనియర్ పర్సనల్ అధికారి డి.ప్రశాంత్, ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేష్, జనరల్ క్యాప్టెన్ కిరణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.