
అలరించిన సైన్స్ డ్రామా పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్‌డ్రామా పోటీలు అలరించాయి. ‘మానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతికత’ అనే అంశంపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించగా, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు. జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సామాజిక స్పృహ కలిగించేలా డ్రామా ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, న్యాయ నిర్ణేతలు వెంకటేశ్వర్లు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.

అలరించిన సైన్స్ డ్రామా పోటీలు