
రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. రెడ్డి జాగృతి నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీల్లో విభేదాలు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీసీల పాత్ర కీలకమైందని, తమ హక్కులు కాలరాసే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీసీలు సంఘటితమై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పిటిషన్‌ను వెనక్కి తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధిక, సుప్రజ, ఇరుకుల మంగ, మామిడి కిరణ్, లహుకుమార్, వెంకటేశ్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.