దిగుబడిపై వానదెబ్బ | - | Sakshi
Sakshi News home page

దిగుబడిపై వానదెబ్బ

Oct 10 2025 5:58 AM | Updated on Oct 10 2025 5:58 AM

దిగుబడిపై వానదెబ్బ

దిగుబడిపై వానదెబ్బ

● చెట్లపైనే తడిసి ముద్దవుతున్న పత్తి ● దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతున్న తెగుళ్లు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): గతేడాది వర్షాలు లేక పంటలు దెబ్బతినగా ఈ ఏడాది అధిక వర్షాలు పత్తి పంటను నాశనం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూముల్లో తేమశాతం అధికమై మొక్కల్లో ఎదుగుదల లోపించింది. ఆశించిన స్థాయిలో పూత రాక కాయల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా జిల్లాలో దసరా తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఈసారి మాత్రం పండుగ దాటినా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెగుళ్లు పెరిగి దిగుబడిపై ప్రభావం పడుతోంది. మెరుగైన దిగుబడి సాధించవచ్చని భావించిన రైతుల ఆశలు అడియాశలుగా మారుతున్నాయి.

పత్తిదే అగ్రస్థానం..

జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తిదే అగ్రస్థానం. అన్ని మండలాల్లో రైతులు పత్తి సాగుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 3.5లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి రైతులు 20 రోజులు ముందుగానే విత్తనాలు విత్తుకున్నారు. ప్ర స్తుతం ఏరే దశకు చేరుకున్నా వర్షాలు వీడడం లేదు. నెలన్నర రోజులుగా రోజు విడిచి రోజు అన్నట్లుగా కురుస్తున్నాయి. ఇది పంటలౖపై ప్రతికూల ప్రభా వం చూపుతోంది. అధిక వర్షపాతంతో ఆకుమచ్చ తెగుళ్లు, పండు ఆకు తెగుళ్లతోపాటు వేరుకుళ్లు తెగులు విపరీతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆశించిన స్థాయిలో కాయలు లేక దిగాలు చెందుతున్న రైతులకు తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నివారణకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నా వర్షాలతో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. వేరుకుళ్లు తెగుళ్ల కారణంగా పత్తి మొక్కలు వడలిపోతున్నాయి. ఆకుమచ్చ తెగుళ్లతో చెట్లు పూర్తి దెబ్బతిని మోడుగా మారుతున్నాయి.

చినుకులకు తడిసి ముద్ద..

జిల్లాలో ముందస్తుగా సాగు చేసిన చేలలో పత్తి ఏరే దశకు చేరుకుంది. కానీ చినుకులకు చెట్లపైనే తడిసి ముద్దవుతోంది. చేతికందిన పంట కళ్ల ముందే చినుకులకు దెబ్బతింటుండడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడిప్పుడే పగులుతున్న కాయలు వర్షాల కారణంగా నీరుచేరి పుచ్చిపోతున్నాయి. వర్షాలతో ఒక్కో ఎకరంలో సుమారు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు పత్తి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు మరింత కలవరపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్టుబడి కోసం చేసిన అప్పులు కూడా తీరే అవకాశం లేదని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement