
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
వాంకిడి(ఆసిఫాబాద్): నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ యు.స్రవంతి అన్నారు. ‘నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన విత్తనాలతో సాగు చేసిన పంటలను బుధవారం సందర్శించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఆధ్వర్యంలో నాణ్యమైన కంది, పెసర విత్తనాలను రైతులకు అందించినట్లు తెలిపారు. వాంకిడికి చెందిన బండె నాందేవు సాగు చేసిన కంది పంటను పరిశీలించి సూచనలు చేశారు. విత్తనోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ మార్పులు, పంటల స్వభావం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ప్రతీ గ్రామం విత్తన స్వ యం సంవృద్ధి సాధించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.ప్రసూన, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృష్ణ, ఏఈవోలు రాజేశ్వర్, శంకర్ పాల్గొన్నారు.