
మెనూపై పట్టింపేది..?
చింతలమానెపల్లి: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేలా రూపొందించిన మెనూ అమలు కావడం లేదు. చింతలమానెపల్లి మండలం బాబాపూర్ ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఉదయం అల్పాహారంలో పులిహోరకు బదులుగా కిచిడీ అందించారు. మధ్యాహ్నం వెజ్ బిర్యాణి, ఆలు కుర్మ, పెరుగు, కోడి గుడ్డుకూర, స్నాక్స్‌లో అరటిపండు లేదా బొప్పాయి పండు అందించాలి. కానీ మధ్యాహ్నం భోజనంలో వంకాయ ఆలుగడ్డ కూర, పప్పుతో సరిపెట్టారు. దసరా సెలవుల తర్వాత మెనూ పాటించడం లేదని, కోడిగుడ్లు, చికెన్‌తో ఇప్పటి వరకు భోజనం అందించలేదని విద్యార్థినులు తెలిపారు. పాలు, పెరుగుతోపాటు వస్తువులు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదని, అందుకే మెనూ అమలు చేయడం లేదని ప్రధానోపాధ్యాయుడు గోపి తెలిపారు. శుక్రవారం నుంచి మెనూ అమలు చేస్తామని పేర్కొన్నారు.