ఆసిఫాబాద్: హిందూ ఉత్సవాలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన బంద్ జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసిఫాబాద్ పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో ప్రధాన మార్కెట్, ఇతర కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. అఖిలపక్ష నాయకులు, హిందూ సంఘాల నాయకులు, దుర్గామాత, గణేశ్ మండళ్ల నిర్వాహకులు స్థానిక షిర్డీసాయి మందిర్ వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైని సస్పెండ్ చేయడంతోపాటు నిమజ్జనం సందర్భంగా పలువురిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కు వినతిపత్రం అందించారు. వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులతో ఎదురవుతున్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది అధికారులు పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవా లని కోరారు. అఖిలపక్ష పార్టీల నాయకులు మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గాదెవేణి మల్లేశ్, గుండ శ్యామ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గాంధీచౌక్‌లో మూసిఉన్న దుకాణాలు
వినతిపత్రం ఇస్తున్న అఖిలపక్ష నాయకులు
ఆసిఫాబాద్ బంద్ ప్రశాంతం