మధిర నియోజకవర్గం లక్ష్మీపురంలో చకచకా నిర్మాణం
రఘునాథపాలెంలోనూ పర్వాలేదు...
నత్తనడకన మిగతా మూడు నిర్మాణాలు
నిపుణులతో పర్యవేక్షణ
ఎక్కడెక్కడ?
లక్ష్మీపురం..
వైరా: అన్నివర్గాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించే సంకల్పంతో నియోజకవర్గానికి ఒక గురుకులాన్ని మంజూరు చేశారు. తొలినాళ్లలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేక స్థలం ఖరారులో జాప్యం జరిగింది. ఆతర్వాత అన్నీ అనుకూలించడంతో జిల్లాలోని వైరా, మధిర, సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం లక్ష్మీపురంలో మాత్రమే నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉన్నా... వైరా, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో మాత్రం పనులు ఊపందుకోకపోవడం గమనార్హం.
25 ఎకరాలు.. రూ.200కోట్ల నిధులు
బోధన, వసతి సౌకర్యాలకు సరిపడా భవనాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు క్వార్టర్లతో పాటు ఇతర అన్ని వసతుల కల్పన కోసం ప్రతీ గురుకులానికి 25 ఎకరాల స్థలం కేటాయించారు. నిర్మాణాల కోసం రూ.200 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు శాఖల వారీగా గురుకులాలు ఉండగా వసతులు ఉన్నచోట మాత్రమే సాఫీగా సాగుతుండగా.. అక్కడి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మిగతా చోట్ల మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యాన ప్రతీ విద్యార్థిని ఉత్తమంగా తీర్చిదిద్దేలా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణం జరుగుతోంది.
జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లుమంజూరు
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు ప్రత్యేక ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు. అన్నిచోట్ల గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తాం.
– సురేష్, ఏఈ, సాంఘిక సంక్షేమ శాఖ
వైరా నియోజకవర్గానికి కేటాయించిన ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో వైరాలోని సాంఘిక సంక్షేమ గురకుల బాలికల పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నారు. మధిర నియోజకవర్గానికి సంబంధించి బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో, సత్తుపల్లి నియోజకవర్గానికి కల్లూరు మండలం చెన్నూరులో, పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మాణం చేపడుతున్నారు. అన్నిచోట్ల ఒకే రకమైన ప్లాన్‌తో నిర్మిస్తున్నారు. వైరా, పాలేరు, సత్తుపల్లి బేస్‌మెంట్‌స్థాయిలోనే ఉండగా.. మధిర నియోజకవర్గ గురుకులం మాత్రం చివరి దశకు చేరగా... వచ్చే విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభించే అవకాశముంది. ఇక ఖమ్మం నియోజకవర్గ గురుకుల నిర్మాణం కూడా వేగంగానే జరుగుతోంది. వైరా, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల గురుకులాల నిర్మాణాలు పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందో స్పష్టత రావడం లేదు.


