బాగానే మేనేజ్ చేశామే..
● పీఎంఈజీపీ యూనిట్ల రికార్డులు తనిఖీ ● డీసీసీబీ అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో పరిశీలన
సత్తుపల్లి: డీసీసీబీ సత్తుపల్లి బ్రాంచ్‌లో పీఎంఈజీపీ సబ్సిడీ రుణాల అవకతవకలపై ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టింది. డీసీసీబీ బ్రాంచ్‌లో టెస్కాబ్ డీజీఎం సంపత్‌కుమార్, ఏజీఎం మణికాంత్, డీసీసీబీ ఏజీఎం ప్రవీణ్ విడివిడిగా సబ్సిడీ రుణాల రికార్డులను పరిశీలించారు. రెండు రోజుల నుంచి ఈ విచారణ అంతర్గతంగా జరుగుతోందని తెలియగా, అవసరమైతే యూనిట్లను పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు. యూనిట్ల మంజూరు, ఇందుకు తీసుకున్న ప్రాతిపదికన, క్షేత్రస్థాయిలో పరిశీలించారా, ప్రస్తుతం అక్కడ యూనిట్ ఉందా, సబ్సిడీ కేటాయించే సమయాన థర్డ్ పార్టీ విచారణ నివేదిక ఉందా, లేదా అన్న అంశాలపై అధికారులు లోతైన విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
మూడేళ్లు సాఫీగా సాగితేనే..
యూనిట్ కోసం రుణం తీసుకున్న తర్వాత రెండు, మూడు నెలలకే పీఎంఈజీపీ సబ్సిడీ బ్యాంక్‌కు చేరుతుంది. కానీ మూడేళ్ల తర్వాతే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు లబ్ధిదారులు యూనిట్ నడుపుతున్నాడా లేదా ధ్రువీకరణ కోసం థర్డ్ పార్టీ విచారణకు కేటాయించిన పోస్టల్ శాఖకు జాబితా ఇస్తే ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్‌ఓసీ ఇవ్వాలి. అప్పుడు సబ్సిడీ విడుదల చేయాల్సి ఉండగా.. కొన్నిచోట్ల యూనిట్లు లేకుండానే ఇతర యూనిట్ల వద్ద ఫ్లెక్సీలు పెట్టి జియో ట్యాగింగ్ చేసి సబ్సిడీ రుణం స్వాహా చేశారనే ఆరోపణలపై విచారణ చేపడుతుండగా అక్రమార్కులు, అధికారులకు టెన్షన్ పట్టుకుంది.
12 యూనిట్లకే సబ్సిడీ
సత్తుపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో 74యూనిట్లకు రూ.12.40కోట్లు పీఎంఈజీపీ రుణాలు ఇచ్చారు. దీంట్లో ఇటీవలే 12 మందికి సబ్సిడీ రుణం మంజూరు చేసినట్లు రికార్డుల పరిశీలనలో తేలింది. అదీకాక సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్‌గా జంగం కిషోర్ వచ్చాక 2024నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు 20యూనిట్లకు రూ.3.50కోట్లు పీఎంఈజీపీ రుణాలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. వీటన్నింటిపై అధికారులు విచారణ చేస్తున్నారు.
తనిఖీకి వస్తున్నారని...
టెస్కాబ్, డీసీసీబీ అధికారుల బృందం యూనిట్ల తనిఖీకి వస్తున్నారనే సమాచారం బ్యాంక్ అధికా రుల నుంచే అక్రమార్కులకు చేరినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు యూనిట్లు లేని వారు నానాపాట్లు పడి సామగ్రి అద్దెకు తీసుకువచ్చి అధికారుల రాక కోసం ఎదురుచూడటం కనిపించింది. ఇంకొందరు ఇళ్లకు తాళాలకు వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇకపోతే కొందరు అక్రమార్కులు రుణం పొందేందుకు బ్యాంక్ సిబ్బంది సహకారంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తహసీల్దార్ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి రికార్డు సృష్టించినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు త్వరలోనే తేలనున్నాయి.
అక్రమార్కులు రాత్రికి రాత్రే యూనిట్లు పెట్టి బాగానే మేనేజ్ చేశామని సంబర పడిపోయారు. కానీ అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నట్లు సమాచారం. యూనిట్‌కు రుణం తీసుకున్నప్పుడు సామగ్రి కొనుగోలు సమయాన కూడా నకిలీ బిల్లులు సృష్టించి డబ్బు డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్ల నుంచి యూనిట్లు నడుస్తుంటే సంబంధిత లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, వేతనాలు, జీఎస్‌టీ, విద్యుత్ బిల్లులు, అద్దె చూపించాలనే నిబంధనల నుంచి ఎలా బయటపడాలా అని అక్రమార్కులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. అధికారుల విచారణలో ఏం తేలుస్తారనేది రెండు, మూడు రోజుల్లో బయటపడనుంది.


