నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

Jul 30 2026 12:27 AM | Updated on Jul 30 2026 12:27 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం భద్రాద్రి జిలాల చంద్రుగొండ మండలంలోని మంగయ్య బంజర్‌, పోకలగూడెం, రవికంపాడు గ్రామాల్లో సీసీ రోడ్లు, కాజ్‌వే పనులను ప్రారంభిస్తారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలం కొత్తూరు, నర్సాపురం, ఊటుపల్లి, రంగపురం, ఎరగ్రుంట గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు మంత్రి హాజరవుతారు. అలాగే, భీమునిగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు కల్లూరులో జరిగే కల్లూరు, తల్లాడ మండలాల స్థాయి ప్రజాదర్బార్‌లో మంత్రి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.

మార్కెటింగ్‌, బ్రాండింగ్‌పై అవగాహన

ఖమ్మంగాంధీచౌక్‌: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం లబ్ధిదారులకు మార్కెటింగ్‌, బ్రాండింగ్‌పై హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎంఈ–డీఎఫ్‌ఓ అధికారులు బుధవారం ఖమ్మంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌ ఫైనాన్సియల్‌ లిటరసీ, ఈ–కామర్స్‌, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలెప్‌మెంట్‌ వంటి అంశాలపై అవగాహన కల్పించి ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఎంఎస్‌ఎంఈ–డీఎఫ్‌ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌, ఖమ్మం లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రవిప్రసాద్‌, ఎన్‌ఎస్‌డీసీ కోఆర్డినేటర్‌ ప్రశాంత్‌, ఐపీపీబీ మేనేజర్‌ రాజేష్‌, ఐపీఓ పృధ్వీ, జేఎస్‌ఎస్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ, ఈడీసీ అసిస్టెంట్‌ మేనేజర్‌ పవన్‌, మార్కెటింగ్‌ నిపుణుడు పష్యమిత్ర పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంక్షరణ

అందరి బాధ్యత

జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్‌

సత్తుపల్లిటౌన్‌: అటవీ సంపద, పులులు, వన్యప్రాణుల సంరక్షణను ప్రతీఒక్కరు బాధ్యతగా భావించాలని జిల్లా అటవీశాఖాధికారి అనూజ్‌ అగర్వాల్‌ పేర్కొఅన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి అటవీ డివిజన్‌ కార్యాలయంలో బుధవారం మైనార్టీ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు డీఎఫ్‌ఓ బహుమతులు అందజేసి మాట్లాడారు. అడవుల పరిరక్షణలో అటవీ శాఖ ఉద్యోగులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేంజర్‌ ఎల్లయ్య, ఉద్యోగులు, ప్రిన్సిపాల్‌ వెంకట్రామయ్య పాల్గొన్నారు.

సౌర విద్యుత్‌ ఉత్పాదన పథకంపై ఆరా

ఖమ్మంమయూరిసెంటర్‌: గృహ వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించడమే కాక హరిత శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ’ప్రధాన మంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజన’ అమలుపై ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్‌సభలో బుధవారం ఆయన తెలంగాణలో పథకం ప్రస్తుత పురోగతిపై ఆరా తీశారు. దీనికి కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రి ప్రల్హాద్‌ జోషి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో కోటి ఇళ్లకు సోలార్‌ రూఫ్‌ టాప్‌లు అమర్చాలనే లక్ష్యంతో రూ.75,021 కోట్లతో పథకాన్ని అమలు చేస్తుండగా, జూలై 2024 నాటికి దేశవ్యాప్తంగా 40,07,355 సోలార్‌ సిస్టమ్‌లు ఏర్పాటయ్యాయని తెలిపారు. పథకం అమలును మరింత వేగవంతం చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోగా అనుమతులు ఇస్తుండగా, జాతీయ బ్యాంకుల అనుసంధానం ద్వారా రుణాలను అందిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement