జిల్లాపై అల్పపీడన ప్రభావం
ఎడతెరిపి లేకుండా రోజంతా జల్లులు
సాగులో ఉన్న పంటలకు
ప్రయోజనకరం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం జిల్లాపై మంగళవారం నుంచే ఉన్నా బుధవారం పూర్తిగా ముసురు వాతావరణం నెలకొంది. రోజంతా నిరంతరాయంగా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అయితే, ఎక్కడ కూడా వరద ప్రవహించే స్థాయిలో వర్షం కురవకున్నా వేడి తగ్గడంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. కాగా, వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతలు ఆనందపడ్డారు. కానీ ఆ స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.
జల్లులకే పరిమితం
జిల్లాలోని కారేపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇక బుధవారం సాయంత్రం 5గంటల వరకు కొణిజర్లలో 6.8, లింగాలలో 4.3, బచ్చోడులో 4, మంచుకొండలో 3.3, సత్తుపల్లిలో 3, రఘునాథపాలెం, ఏన్కూరు, తిరుమలాయపాలెం, కాకరవాయి, పల్లెగూడెం, ఖమ్మం ఖానాపురంలో 2.5, ప్రకాష్‌నగర్, ముదిగొండలో 2 మి.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు బోనకల్, కల్లూరు మండలాలు సాధారణ వర్షపాతంలో ఉండగా, మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. ప్రధానంగా కూసుమంచి, ఎర్రుపాలెం మండలాలు అత్యధిక లోటు ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మెట్ట పంటలకు ఉపయోగం
ప్రస్తుత కురుస్తున్న జల్లులు మెట్ట పంటలకు ప్రయోజకరంగా మారాయి. జూన్‌లో కురిసిన వానలకు జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఇందులో అత్యధికం మెట్ట పంటలే ఉన్నాయి. పత్తి ఇప్పటివరకు 2.31 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, పెసర 22,500 ఎకరాల్లో సాగైంది. అలాగే, కంది, చెరకు, మినుములు, మొక్కజొన్న కూడా సాగు చేస్తుండగా, ప్రస్తుతం ముసురుగా కురుస్తున్న జల్లులు ఈ పంటలకు ఉపయోగపడుతున్నాయి. అలాగే, పత్తి పైరులో రైతులు పైపాటుగా దుక్కి ఎరువులు వేస్తున్నారు.


