నీట మునిగి మృత్యువాత
పడుతున్న భక్తులు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అవగాహన లేక ప్రమాదాలు
నది ఒడ్డున సరైన రక్షణ చర్యలు లేక ఇక్కట్లు
సమన్వయం లేక..
భద్రాచలంఅర్బన్: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని గోదావరి నదిలో వరుస విషాద ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవ దర్శనానికి వస్తున్న భక్తులు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు నది లోతు అంచనా వేయలేక వృత్యువాత పడుతున్నా.. అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. అటు ఆలయ అధికారులు, ఇటు ఇరిగేషన్, పోలీస్, రాష్ట్ర విపత్తు శాఖ అధికారుల సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడా వుడి చేయడం.. ఆ తర్వాత నివారణపై ప్రణాళికలు లేకపోవడం రామభక్తులు, భద్రాచలం పట్టణ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తాజాగా ఐదుగురు
భద్రాచలానికి 15 కి.మీ. దూరాన ఉన్న గొల్లగూడెంలో ఈ నెల 18న చేపల వేటకు వెళ్లిన గొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. అలాగే, ఈ ఏడాది మార్చి 20వ తేదీన భద్రాచలానికి చెందిన ఇద్దరు, విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న మరో ఐదుగురు కూనవరం రోడ్డు లోని ఏపీ సరిహద్దున ఉన్న గోదావరికి సరదాగా వచ్చారు. లోతు అంచనా వేయలేక ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో ఐదుగురు మృతి చెందా రు. అలాగే, భద్రాచలం వద్ద గోదావరిలో దూకి పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఏడాది పొడువునా రామయ్య భక్తులు భద్రాచలం వస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులంతా గోదావరి పుణ్యస్నానం ఆచరించాక రామయ్య ను దర్శించుకోవడం ఆనవాయితీ. వీరిలో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రమాదాలిలా..
భద్రాచలం వద్ద గోదావరిలో 2014లో ఆరుగురు మృతి చెందారు. 2015లో ఏడుగురు, 2016లో ఐదుగురు, 2017లో ఐదుగురు, 2018లో నలుగురు, 2019లో నలుగురు, 2020లో ఐదుగురు, 2021లో ఎనిమిది, 2022లో 12 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. ఇక 2024లో 10 మంది, 2025, 2026 ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందగా, మరికొందరు గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
భక్తులను రక్షిస్తున్న ఫొటోగ్రాఫర్లు
భద్రాచలం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ గల్లంతవుతున్న భక్తులను ఫొటోగ్రాఫర్లు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కాపాడుతున్నారు. ఇక్కడ ఫొటోలు తీస్తూ జీవనం సాగించే గజ ఈతగాడైన కరకు ప్రసాద్ 2024 నుంచి ఇప్పటి వరకు 19 మందిని కాపాడాడు. అంతేకాక గోదావరిలో నీటమునిగి చనిపోయిన వారి మృతదేహల వెలికితీతలోనూ ఉద్యోగులకు సహకరిస్తుంటాడు.
గోదావరి తీరాన
మృత్యుఘోష
గోదావరి స్నానఘట్టాల వద్ద రామాలయం, ఇరిగేషన్, పోలీస్, రాష్ట్ర విపత్తు శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు విధులు నిర్వర్తించే గజ ఈతగాళ్లకు చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుండడంతో వారు స్నాన ఘట్టాల వద్ద అందుబాటులో ఉండడం లేదు. దీంతో భక్తులు స్నాన ఘట్టాల వద్ద కాకుండా మరింత లోతు కు వెళ్లి అంచనా వేయలేక గల్లంతవుతున్నారు. గజ ఈతగాళ్లను కీలక ప్రాంతాల్లో నియమిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశముంది. గోదావరి తీరాన ఎల్లవేళలా ఉండేలా 2025 మార్చి 4న ఇద్దరు గజ ఈతగాళ్లను దేవస్థానం, మరో ఇద్దరిని గ్రామపంచాయతీ ఆధ్వర్యాన నియమించి, జీతం చెల్లిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెంచడంతో పాటు వరదల సమయంలోనే కాక ఇరిగేషన్, పోలీస్ అధికారులు గోదా వరి ఒడ్డు, కరకట్ట ప్రాంతంలో గస్తీ పెంచి, మైక్ ద్వారా హెచ్చరికలను జారీ చేస్తేప్రమాదాలు తగ్గుతాయని చెబుతున్నారు.


