కారేపల్లి: యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ లభించని వైనమిది. కారేపల్లి మండలం భల్లునగర్‌తండా గ్రామానికి చెందిన గుగులోతు సోమ్లా – సుజాత కుమార్తె నవీన మే 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఏడాది క్రితం సోమ్లా మృతి చెందగా తల్లి సుజాత నవీనతో పాటు కుమారుడిని కూలీనాలీ చేసి పోషిస్తోంది. మేజర్ అయిన ఆమె ఒక కాలు, ఒక చేయికి స్వల్ప పక్షవాతం రావటంతో ఇంటి వద్దే ఉంటోంది. ఇంటి నుంచి వెళ్లి రాకపోవడంతో ఎక్కడ వెతికినా ఆచూకీ లేక జూన్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి తన కుమార్తె ఏమైపోయిందోనని నవీన తల్లి, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
హైస్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ
కారేపల్లి: కారేపల్లి హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ బుధవారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ విద్యార్థి కారేపల్లి బీసీ హాస్టల్‌లో ఉంటూ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అదే తరగతి చదువుతున్న ఇంకో విద్యార్థితో వివాదం జరిగింది. దీంతో ఆయన హాస్టల్ విద్యార్థిని స్కూల్ వెనకాల మైదానానికి పిలిచి, మరో 15 మంది విద్యార్థులతో కలిసి విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో సదరు విద్యార్థికి గాయాలు కాగా.. కొందరు తీసిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమాన హాస్టల్ విద్యార్థి తన స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు వివరించడమే కాక, ఇక నుంచి స్కూల్‌కు వెళ్లనని చెప్పాడు. దీంతో వారు కారేపల్లి హైస్కూల్ హెచ్‌ఎంకు ఫిర్యాదు చేయగా, బుధవారం ఎంఈఓ జయరాజు దాడిలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: మండలంలోని మత్కేపల్లి క్రాస్ వద్ద ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు సీజ్ చేశారు. చిన్నమండవ మున్నేటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.
పోషించలేక.. బిడ్డను వదిలేసి
భద్రాచలంఅర్బన్: భోజనం చేసి వస్తానని చెప్పి 45 రోజుల వయస్సు కలిగిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తి భద్రాచలంలో అన్నదాన సత్రం వద్ద వృద్ధుడికి అప్పగించి వెళ్లిపోయిన వైనమిది. నల్లగొండ జిల్లా అడివిదేవులపల్లికి చెందిన ఆకుల నారాయణ బుధవారం రామాలయానికి వచ్చి దర్శనం అనంతరం అన్నదాన సత్రం వద్ద కూర్చున్నాడు. ఈ సమయాన ఎరుపు రంగు దుస్తులు ధరించిన 30ఏళ్ల వయసు వ్యక్తి వచ్చి భోజనం చేసే వరకు పాపను పట్టుకోండని అప్పగించి వెళ్లాడు. ఆయన ఎంతకూ రాకపోవడం, శిశువు ఆకలితో ఏడుస్తుండడంతో ఆటోడ్రైవర్ల సాయంతో శిశుగృహలో అప్పగించారు. ఈ మేరకు ఆడ శిశువును అప్పగించిన వ్యక్తి ఆచూకీ గుర్తించేందుకు ఐసీడీఎస్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పరిశీలిస్తుండగా బిడ్డను వదిలివెళ్లిన వ్యక్తి భద్రాచలం చెక్‌పోస్టు వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఏపీకి చెందిన తాను వరంగల్‌లో ఉంటున్నట్లు చెప్పాడని తెలిసింది. ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవడంతో బిడ్డను వదిలివెళ్లినట్లు అంగీకరించాడని సమాచారం. ఈ నేపథ్యాన పోలీసులు పూర్తి వివరాల సేకరణలో నిమగ్నమైనట్లు తెలిసింది.


