చింతకాని: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ స్వామికి ఉండ్రాళ్లను సమర్పించారు. సర్పంచ్ నారగాని రాంబాయి, ఆలయ కమిటీ చైర్మన్ ముత్తినేని వెంకటేశ్వర్లు, అర్చకులు రాళ్లబండి వెంకటరమణశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
పతకాలకు ఎంపికై న ఉద్యోగులకు అభినందనలు
ఖమ్మంక్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ సేవా పతకాలకు ఎంపికై న ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులను సీపీ సునీల్‌దత్ బుధవారం అభినందించారు. వైరా ఏసీపీ సారంగపాణి, ట్రాఫిక్ ఎస్‌ఐ మౌలానా, ఎస్‌ఐ అమీర్‌ఖాన్ తదితరులు పతకాలకు ఎంపికయ్యారు. ముగ్గురు ఉత్తమ సేవా పతకాలు, ఏడుగురు సేవా పతకాలు, ముగ్గురు ఉత్కృష్ట పతకాలు సాధించగా.. సీపీ వారికి పతకాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం తదితరులు పాల్గొన్నారు.
కోల్‌బెడ్ మీథేన్
అన్వేషణకు పెద్దపీట
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలోని బొగ్గు గనుల్లో ‘కోల్ బెడ్ మీథేన్’(సీబీఎం) అన్వేషణపై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 92 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల మేర సీబీఎం వనరులను గుర్తించినట్లు ప్రకటించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ అంశంపై ప్రశ్నించగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే సమాధానం ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడుతో పాటు తెలంగాణలో ఈ వనరులు విస్తరించి ఉన్నాయని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 సీబీఎం బ్లాకులు క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 1,232 బావులు తవ్వగా, ప్రస్తుతం రోజుకు సుమారు 2.28 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి సాధిస్తున్నట్లు వివరించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా
సత్తుపల్లిటౌన్: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా ప్రవేశ పెడుతుండటంతో ఉద్యోగుల నియామకాలు జరగక, ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్టీసీ ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.మౌలానా ఆందోళన వ్యక్తం చేశారు. సత్తుపల్లి కళాభారతిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆర్టీ సీని త్వరగా ప్రభుత్వంలో విలీనం చేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఎన్‌ఎంయూలో చేరారు. నాయకులు సత్యం, పాల్, కృష్ణ, ఎల్‌ఆర్‌కే.రావు, గఫార్, బాలస్వామి, దేవి, మహబూబి, కృష్ణకుమారి పాల్గొన్నారు.
నేడు భారజల కర్మాగారం ఉద్యోగ సంఘం ఎన్నికలు
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం జరగనున్నాయి. కర్మాగారంలోని క్యాంటీన్–1లో పోలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా రాయల రాజేశ్, సంయుక్త కార్యదర్శిగా రామచంద్ర జైస్వాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 11 ఎగ్జిక్యూటివ్ సభ్యుల స్థానాల్లో ఎనిమిది ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు స్థానాలకు ఆరుగురు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో టీఎన్‌టీయూసీ – బీఎంఎస్ కూటమి, సీఐటీయూ – టీఆర్‌టీయూ కూటమి, ఐఎన్‌టీయూసీ బరిలో ఉన్నాయి.
పేకాటరాయుళ్ల అరెస్ట్
ముదిగొండ: మండలంలో గోకినేపల్లి శివారు ఆయిల్‌పామ్ తోటలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ముగ్గురి పట్టుబడగా, మరికొందరు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రూ.1,200 పాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


