సమయపాలన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన తప్పనిసరి

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

తిరుమలాయపాలెం: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. హెచ్చరించారు. తిరుమలాయపాలెం సీహెచ్‌సీలో ఇటీవల ఓ వృద్ధుడికి చేసిన చికిత్స వికటించిందని కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, వైద్యులు సమయపాలన పాటించడం లేదని ఈనెల 17న ‘సాక్షి’తో ‘తీరు మారదా..’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన క్యాజువాలిటీ, లేబర్‌ రూమ్‌, ఎమర్జెన్సీ వార్డ్‌, ల్యాబ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలించడమే కాక మందుల నిల్వలపై ఆరా తీశారు. అలాగే, చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలిన గాయాలతో చికిత్స కోసం వచ్చిన ఒంటరి మహిళ జయమ్మ తనను ఆదుకోవాలని కోరగా పెన్షన్‌, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీఓ సిలార్‌ సాహెబ్‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, మండల కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి పనులను పరిశీలించి నాణ్యతపై సూచనలు చేశారు. డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌గౌడ్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కృపా ఉషశ్రీ, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్‌ విల్సన్‌, సర్పంచ్‌ సుజాత, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాకరవాయిలో జరుగుతున్న సమగ్ర భూసర్వే ఆన్‌లైన్‌, ఎస్‌ఐఆర్‌పై తహసీల్దార్‌ విల్సన్‌, డీటీ సుధీర్‌తో కలిసి కలెక్టర్‌ దివాకర సమీక్షించారు.

తిరుమలాయపాలెం సీహెచ్‌సీలో

కలెక్టర్‌ దివాకర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement