ముందే సర్దేశారా.. | - | Sakshi
Sakshi News home page

ముందే సర్దేశారా..

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

● విస్తృత తనిఖీలతోపాటు నిఘా పటిష్టం చేసిన టాస్క్‌ఫోర్స్‌ ● అయినా వెలుగుచూస్తున్న నకిలీ, అనుమతి లేని విత్తనాలు ● అమాయక రైతులే లక్ష్యంగా అక్రమార్కుల దందా

గ్రామీణ ప్రాంతాలపైనే గురి

జిల్లా మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు?
● విస్తృత తనిఖీలతోపాటు నిఘా పటిష్టం చేసిన టాస్క్‌ఫోర్స్‌ ● అయినా వెలుగుచూస్తున్న నకిలీ, అనుమతి లేని విత్తనాలు ● అమాయక రైతులే లక్ష్యంగా అక్రమార్కుల దందా

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వానాకాలం సాగు సీజన్‌ మొదలవుతున్న వేళ నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చేశాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే ఎల్‌నినో ప్రభావంతో సేద్యంపై ఈసారి అయోమయం నెలకొంది. అయితే, గత కొన్నేళ్ల మాదిరిగా ఈసారి కూడా నకిలీ విత్తనాల జోరు రైతులను ఇబ్బందులు పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క వ్యవసాయ, పోలీసు శాఖలతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విత్తన దుకాణాల్లో ముమ్మర తనిఖీలు చేస్తుండమే కాక పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి. అయితే, అక్రమార్కులు ముందుగానే జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాలకు నకిలీ విత్తనాలను చేర్చారనే ప్రచారం జరుగుతోంది.

ముమ్మరంగా తనిఖీలు

జిల్లాలో పత్తి, మిర్చి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా వ్యవసాయ, పోలీస్‌ శాఖలు విత్తన దుకాణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నాయి. మండల కేంద్రాల్లో షాపుల్లో తనిఖీ చేయడమే కాక నకిలీ విత్తనాలు అమ్మితే తీసుకునే చర్యలపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక రైతులు కూడా గ్రామాలకు వచ్చే వారి నుంచి కాకుండా డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

అయినా ఆగడం లేదు...

అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు ఆగడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పత్తి, మిర్చి విత్తనాల కొనుగోలుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా కొందరు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిసింది. తక్కువ ధరకే వస్తాయని, అధిక దిగుబడులు ఖాయమని నమ్మించి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో కొందరు, లూజ్‌ విత్తనాలను ఇంకొందరు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొన్నిచోట్ల నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా గురువారం కూడా కామేపల్లి మండలం మద్దులపల్లిలో ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరుకు చెందిన ఉప్పుటూరి వెంకటప్పారావు, మద్దులపల్లికి చెందిన జాలె శ్రీనుయాదవ్‌ అనుమతి లేని మిరప విత్తనాలు అమ్ముతూ పట్టుబడ్డారు.

అప్రమత్తతే ఆయుధం

నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమవుతున్నాయి. పదును రాకముందే విత్తనాలు నాటి, ఆతర్వాత వర్షాలు కురవకపోతే భూమిలోనే చనిపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ విత్తనాలు నాటితే వర్షాలు కురిసినా ఫలితం ఉండదు. వీటిని పరిగణనలోకి తీసుకుని రైతులు విత్తనాల ఎంపిక, కొనుగోలులో అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. పాకెట్ల సీల్‌ పరిశీలించడంతో పాటు కంపెనీ పేరు, చిరునామా, లాట్‌ నెంబర్‌, మొలక శాతం, గడువు తేదీతో కూడిన బిల్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాకాకుండా తక్కువ ధరకు వస్తున్నాయని, తెలిసిన వారు చెప్పారని విత్తనాలను కొనుగోలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.

ఏపీకి సరిహద్దుగా జిల్లాలోని పలు ప్రాంతాలు ఉండడంతో అక్కడి నుంచే నకిలీ విత్తనాలు దిగుమతి అవుతున్నాయని తెలుస్తోంది. గతంలోనూ ఆంధ్రాలో తయారు చేసిన విత్తనాలను వైరా తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా విక్రయించిన వారు పట్టుబడ్డారు. ఇప్పుడు అదే తరహాలో దళారులు, ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. అంతేకాక అనుమానం రాకుండా ఉండేందుకు ప్రముఖ కంపెనీలను పోలిన పేర్లు, లోగోలతో ప్యాకెట్లు ముద్రించి అంటగడుతున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement