సత్తుపల్లిటౌన్: వేసవి సెలవుల్లో పట్టణం నుంచి మా చెల్లెలు పిల్లలు రమణి, రాజేశ్ మా ఊరు వచ్చారు. రమణి, రాజేశ్‌ను తీసుకొని సాయంత్రం మార్కెట్‌కు వెళ్లి మామిడి పండ్లు, అరటిపండ్లు, జామకాయలు తెచ్చుకున్నాం. అనంతరం ఇంటి వెనుక కూర్చుని పండ్లు తింటుండగా గుంపుగా వచ్చిన కోతులు పండ్లు ఎత్తుకెళ్లాయి. అంతేకాక ఓ కోతి రమణి చేతిని రక్కింది. ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఇంజక్షన్ చేయించాం. రాత్రి భోజనాలయ్యాక హాల్‌లో కూర్చుంటే రమణి ‘మామయ్యా కోతులు ఉండేది అడవిలో కదా? మరి ఊళ్లోకి ఎందుకొచ్చాయి?’ అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న చిన్నదే అయినా సమాధానం చెప్పడానికి సమయం పట్టింది. ‘అడవిలో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి రావడానికి కారణం మనుషులేనమ్మా.. ఒకప్పుడు కోతులు అడవిలో హాయిగా ఉండేవి. స్వార్థపరులైన మనుషులు అడవులు నరికి వేయడంతో నిలువ నీడలేక, ఆహారం దొరక్క అవి ఇళ్లపై, మనుషులపైన దాడి చేస్తున్నాయి. వాటి కష్టానికి కారణం మనషులే కనుక మనపై కోపం చూపిస్తున్నాయి.’ అని సమాధానమిచ్చాను. ‘మళ్లీ కోతులు అడవిలోకి వెళ్లాలంటే?’ ఏం చేయాలని రమణి అడిగింది. ‘అడవులు అంతరించినందున మొక్కలు నాటి అడవులు పెంచితే కోతులు వాపస్ పోతాయి.’ అని చెప్పా. దీనికి ‘మొక్కలు ఎవరు నాటాలి మామయ్యా?’ రమణి పశ్న వేసింది. ‘మనం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరూ బాధ్యతగా ఈ పని చేయాలి’ అని సమాధానం చెప్పాడు మామయ్య. ‘సరే మామయ్యా రేపు మనం కొన్ని మొక్కలు నాటుదాం’ అంటూ రమణితో పాటు రాజేశ్ సమాధానమిచ్చారు.
–బి.మధుసూదన్‌రాజు,
రాష్ట్రపతి అవార్డు గ్రహీత, సత్తుపల్లి


