మామిడి మంట | - | Sakshi
Sakshi News home page

మామిడి మంట

May 17 2026 12:12 AM | Updated on May 17 2026 12:12 AM

● ధరల పెరుగుదలతో పచ్చడి ప్రియం ● మార్కెట్లోకి అరకొరగా మామిడికాయలు ● ఇతర సామగ్రి ధరతో బెంబేలు

● ధరల పెరుగుదలతో పచ్చడి ప్రియం ● మార్కెట్లోకి అరకొరగా మామిడికాయలు ● ఇతర సామగ్రి ధరతో బెంబేలు

మధిర: వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు చీడపీడలు ఆశించడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి పడిపోయింది. దీంతో మే నెల రాగానే పచ్చడి కాయలతో పాటు ఇతర రకాల అమ్మకాలు జోరందుకోవాల్సి ఉన్నా ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. పలు కారణాలతో పచ్చడి పెట్టుకునే రకాలు మార్కెట్‌లో అరకొరగానే లభిస్తున్నాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, తెల్లగులాబీ వంటి రకాలను పచ్చడి తయారీకి ఉపయోగిస్తారు. కానీ, కొరత కారణంగా ఒక్కో కాయ రకాల ఆధారంగా రూ.20 నుంచి రూ.50కి పైగా ధర పలుకుతోంది. దీనికి ఇతర సామగ్రి ధరలు కూడా పెరగడంతో జనం పచ్చడి పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.

తెగుళ్ల బెడదతో

మామిడి సీజన్‌ ప్రారంభంలో తేనెమంచు పురుగు ఆశించి పూత రాలిపోయింది. కొన్ని చెట్లకు పలుచగా కాయలు కాసినా వాటికి మంగు రావడంతో పాటు పండు ఈగ పురుగు ఆశించింది. దీంతో దిగుబడిపై ప్రభావం పడింది. గతంలో ఒక్కో చిన్న రసం, పెద్ద రసం చెట్టుకు వేయికిపైగా కాయలు కాసేవి. కానీ ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల నేపథ్యాన కొన్ని చెట్లు కాయలే కాయకపోగా మరికొన్ని చెట్లకు పలుచగా ఉన్నాయి. మంగు వచ్చిన మామిడికాయలు పచ్చడికి పనికి రాకపోవడంతో ఉన్న కొద్దిపాటి కాయలకు డిమాండ్‌ పెరిగిది. స్థానికంగా కొరత కారణంగా ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా నూజివీడు, విస్సన్నపేట, ఎ.కొండూరు తదితర మండలాల నుంచి చిరువ్యాపారులు పచ్చడి మామిడి కాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

ఏవీ ఆ ఘుమఘుమలు?

దాదాపుగా మామిడికాయ పచ్చడి తినని వారెవరూ ఉండరు. మధ్యతరగతి, సామాన్య కుటుంబాల్లో ఉదయం పనులు, కూలీకి వెళ్లేవారు పచ్చడితో భోజనం చేసి బయలుదేరతారు. మిగతా కుటుంబాల్లోనూ ఏటా వేసవిలో పచ్చడి పెట్టుకోవడం ఆనవాయితీ. ఏడాదంతా నిల్వ ఉండేలా మామిడి పచ్చడి పెట్టడం కనిపించేది. కానీ ఈసారి కాయల కొరత, సామగ్రి ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కానరావడం లేదు. కొందరు పచ్చడి పెట్టినా 100కు బదులు 50, 50కి బదులు ఇరవై కాయలతో సరిపెట్టుకుంటున్నారు.

ధరాఘాతం

ఏడాది పాటు నిల్వ ఉండే మామిడి పచ్చడి తయారీకి ఉపయోగించే పదార్థాల ధరలు మండిపోతున్నాయి. చిన్న కాయ అయినా ముక్కలు కొట్టడానికి రూ.5 నుంచి రూ.10 తీసుకుంటున్నారు. ఇదికాక నూనె, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇక పచ్చడి పెట్టేందుకు అవసరమైన లావు రకం మిర్చి కేజీ రూ.500 పైగా పలుకుతుండడం గమనార్హం. అంతేకాక వెల్లుల్లిపాయలు రూ.230, మెంతులు రూ.160, పల్లీ నూనె రూ.190, నువ్వుల నూనె రూ.410 మేర ధర పలుకుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement