శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి నిత్యకల్యాణం, పల్లకీసేవ

May 17 2026 12:12 AM | Updated on May 17 2026 12:12 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలోని స్వామి విగ్రహంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్యకల్యాణం జరిపించారు. అలాగే, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

భద్రాచలంటౌన్‌: ఉమ్మడి జిల్లాలోని గిరిజన బాలుర గురుకుల కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పించేందుకు భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియను గిరిజన సంక్షేమ గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ బి.అరుణకుమారి పర్యవేక్షించారు. మొత్తం 539 సీట్లకు గాను దరఖాస్తుల పరిశీలన అనంతరం 480 మంది విద్యార్థులను ఎంపిక చేసి కృష్ణసాగర్‌, కిన్నెరసాని, దమ్మపేట, గుండాల, సింగరేణి, తిరుమలాయపాలెం కళాశాలల్లో సీట్లు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు బీ.ఎల్‌.నారాయణరావు, జి.హరికృష్ణ, భాస్కర్‌, ఎం.దేవదాస్‌, రమేష్‌, సీతారాం నాయక్‌, పద్మావతి, హేమలత తదితరులు పాల్గొన్నారు.

జేఈఈ పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు

ఖమ్మంక్రైం: జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) పరీక్షలు ఆదివారం జరగనున్న నేపథ్యాన కేంద్రాల వద్ద ఉదయం 5–30నుంచి రాత్రి 8–30గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. ఈమేరకు కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలకు అనుమతి ఉండదని తెలిపారు. అంతేకాకుండా కేంద్రాల పరిసరాల్లోని ఇంటర్నెట్‌, జిరాక్స్‌ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

రాజీకి అనుకూలమైన కేసులు పరిష్కరించాలి

ఖమ్మంలీగల్‌: రాజీకి అనుకూలమైన కాంపౌండబుల్‌ కేసులను గుర్తించి జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఖమ్మం మహిళా కోర్టు న్యాయమూర్తి ఉసికల శీనయ్య సూచించారు. వచ్చేనెల 20న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌పై శనివారం ఆయన పోలీసు అధికారులతో సమీక్షించారు. లోక్‌అదాలత్‌ విజయవంతం అయ్యేలా పోలీసు అదికారులలు సహకరించాలని సూచించారు. స్టేషన్ల పరిధిలో రాజీకి పరిష్కారానికి అనువైన కేసులను గుర్తించి ఇరుపక్షాలను సమన్వయం చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. అనంతరం డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పి.దేవీమానస మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement